'హైదరాబాద్' విషయంలో జోక్యం చేసుకునేది లేదు: హైకోర్టు
అయితే.. కొందరు పిటిషనర్లు.. హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకో కుండానే హైదరాబాద్‌లో డివిజన్లను ఏర్పాటు చేశారని.. తగిన సమయం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
By: Garuda Media | 23 Dec 2025 7:00 AM ISTతెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై జోక్యం చేసుకునేది లేదని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం-జీహెచ్ ఎంసీ కలిసి.. స్థానికంగా ఉన్న 150 డివిజన్లను 300లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రెండు మాసాలుగా కసరత్తు చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా తెలుసుకున్నారు.
అయితే.. కొందరు పిటిషనర్లు.. హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకో కుండానే హైదరాబాద్‌లో డివిజన్లను ఏర్పాటు చేశారని.. తగిన సమయం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. డివిజన్లను అశాస్త్రీయంగా విభజించడం ద్వారా.. నష్టం జరుగుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ నేతలు కొందరు ఈ డివిజన్లను విభజించారని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అధికారులు సహా ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుంది.
దీనిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల కారణంగా.. పాలన ఫలాలు ప్రజలకు అందడంలో ఆలస్యం అవుతోం దని.. అందుకే.. నగరాన్ని విస్తరిస్తున్నామని.. దీనిలో భాగంగానే 300 డివిజన్లను ఏర్పాటు చేసినట్టు జీహె చ్ ఎంసీ అధికారులు వివరించారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని.. వారి సూచనలు, సలహాలను కూడా పాటించామన్నారు. ప్రస్తుతం 3100 పిటిషన్లు పెండింగులో ఉన్నాయని తెలిపారు. వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు.
ప్రభుత్వం కూడా ఇదే వాదనను వినిపించింది. ప్రజల కోసమే డివిజన్ల ఏర్పాటు చేశామని పేర్కొంది. పాలన సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యమని వివరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఏముందని ప్రశ్నించింది. అన్ని అంశాలను రాజకీయ కోణంలో చూడడం తగదని పేర్కొంటూ.. పిటిషన్లను కొట్టి వేసింది.
