Begin typing your search above and press return to search.

తెలంగాణ ...మస్త్ రైజింగ్...

భారత్ ఫ్యూచర్ సిటీ .... హైదరాబాద్ సమీపంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేల మధ్య 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగా అర్బన్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు.

By:  Tupaki Political Desk   |   16 Dec 2025 9:00 PM IST
తెలంగాణ ...మస్త్ రైజింగ్...
X

ముక్కోటి తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారమవుతున్నాయా? భంగపడ్డ తెలంగాణ బంగారు తెలంగాణగా వెలగనుందా? తెలంగాణ ఇచ్చామంటున్న కాంగ్రెస్ పాలనాహయాంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రూపు రేఖల్ని సమూలంగా మార్చివేస్తున్నారా? ఇన్ని ప్రశ్నలకు ఔననే బదులు ఇవ్వాల్సి వస్తోంది. ఇపుడు తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి అవసరమైన సన్నద్ధతను సాధించుకుంది. వడి వడిగా అడుగులేసే దశ నుంచి వేగంగా పరిగెత్తే దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రాజెక్టులు పట్టాలెక్కితే తెలంగాణ తోపు దమ్ముంటే ఆపు అని నినాదాలు మిన్నంటడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో టీపీసీసీ బాస్ గా రేవంత్ రెడ్డి డైనమిక్ గా వ్యవహరించడం వల్లే కాంగ్రెస్ కు విజయం సాధ్యపడిందని కొందరు పరిశీలకుల వాదన. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు కొదవ లేదు. తెలంగాణకు స్వేచ్చనిచ్చి స్వరాష్ట్ర కలల్ని సాకారం చేసింది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అని గత పదేళ్లుగా కాంగ్రెస్ నేతలు చెప్పినా ...జనాలెందుకో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వలేకపోయారన్నది వాస్తవం. తెలంగాణ ఎవరో ఇచ్చింది కాదు మనమే పోరాడి తెచ్చుకున్నాం. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన యోధుడిగా ...తమది ఉద్యమ పార్టీగా నాటి టీఆర్ ఎస్ ఇప్పటి బీఆర్ ఎస్ ప్రజల్లో విజయవంతంగా వెళ్ళగలిగింది. కేసీఆర్ ను నమ్మి ఆయన చేతిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి మరీ పదేళ్ళపాటు కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ప్రజారంజక హామీలను ఇస్తూనే కేసీఆర్ పనితీరును కాకుండా దొరతనపు అహంకార ధోరణిని ఎండగట్టారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు అసలు ఏం చేయలేదన్న భావనతో ప్రజలకు కాంగ్రెస్ కు పట్టం కట్టలేదు. కేసీఆర్ కుటుంబం ఆధిపత్య, అహంకార ధోరణి పెరిగిందని భావించే వారిని అధికారం నుంచి లాగేశారు. సరైన సమయంలో రంగప్రవేశం చేసిన రేవంత్ రెడ్డి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు అద్భుత విజయాన్ని కానుకగా ఇచ్చారు. అందుకోసమే మరో ప్రత్యమ్నాయం ఆలోచించ కుండా కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టింది.

సీఎం రేవంత్ రెడ్డి తమ పాలనలో ప్రారంభం నుంచే దూకుడు చూపిస్తున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ హామీ అధికారం చేపట్టిన వెనువెంటనే అమలుచేశారు. ఆ తర్వాత ఇంటికి ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అలాగని వారి పాలనలో ఇబ్బందులే లేవా అంటే లేవని కాదు. హైడ్రా పేరిగ సామాన్యు ఇళ్ళన పడగొట్టడం వివాదాస్పదంగా మారింది. అలాగే కంచగచ్చబౌలిలో ప్రభుత్వం భూములంటూ 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ట్రాక్టర్లు పెట్టి చదును చేసే ప్రయత్నం బెడిసి కొట్టింది. కాకపోతే తాజాగా రైజింగ్ తెలంగాణ పేరిట చేపట్టాలనుకున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చాలా ఆకర్షకంగా ఉన్నాయి. ఇవన్నీ అమలైతే చాలా బావుణ్ను అని సగటు తెలంగాణ వాసి అనుకునేలా వున్నాయి.

భారత్ ఫ్యూచర్ సిటీ .... హైదరాబాద్ సమీపంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేల మధ్య 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగా అర్బన్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. 7 మండలాలు, 56 గ్రామపంచాయతీలతో సుమారు 30వేల హెక్టార్లలో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పేరిట నగరం ఆవిష్కరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది కూడా. నివాస, విద్య, వైద్య, ఉపాధి కేంద్రాలకు నడక దూరంలో ఉండేలా 'లివ్, లెర్న్, వర్క్, ప్లే' నగర ఫ్రేమ్‌వర్క్‌తో ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశారు.. ప్రపంచ బ్యాంకు, JICA వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో స్మార్ట్ సిటీగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలో పట్టణ మరియు పారిశ్రామిక విస్తరణతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వనుంది. అయితే ఏకంగా ఒక నగరాన్ని నిర్మించడం సాధ్యపడుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని నిర్మిస్తామని 2019 ఎన్నికల్లో భంగపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా బాబు అమరావతి రాజధానిని కచ్చితంగా అభివృద్ధి చేస్తామనే అంటున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్యూచర్ సిటీ జపం చేస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల కలలు నెరవేరుతాయో లేదో చూడాలి.

అలాగే హైదరబాద్ నగరంలో కేబులిం్ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా మారబోతోంది. బంజారహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ ఈనాలుగు మెట్రో జోన్లలో రూ.4,051కోట్ల నిధులతో ఒవర్ హెడ్ విద్యుత్తు లైన్లను భూగర్భ కేబుల్స్ గా మారుస్తున్నారు. ఈ ప్రక్రియతో నగరర సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ స్కీమ్ నగరంలో చాలా ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. వేలాడే కరెంట్ తీగలు చాలా ప్రమాద సూచికలు. ఇవి లేకపోతే రహదారులపై వాహనాల, భారీ వాహనాల రాకపోకలు సులువుగా మారుతాయి. అలాగే హైవేలు రైల్వే విస్తరణ ప్రణాళికలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. రూ.10,400 కోట్ల వ్యయంతో హైదరాబాద్...విజయవాడను ఎనిమిది లేన్ల జాతీయ రహదారిగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే రూ.36వేల కోట్ల వ్యయంతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం హైదరబాద్ నగరానికి వడ్డాణంగా అమరబోతోంది. ప్యూచర్ సిటీ..మచిలీపట్నం పోర్ట్ తో కలుపుతూ గ్రీన్ పీల్డ్ హైవే, అనుబంధ రైల్వే లైన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక టీ ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలందించబోతున్నారు. ఇప్పటికే పల్లెప్రాంతాల్లో డిష్ లు దర్శనమిస్తున్నాయి. ఈ ఫైబర్ ప్రాజెక్టు అమలు అయితే పల్లెల్లో అధునాతన సాంకేతిక విప్లవం వచ్చినట్లే. విద్యుత్ రంగ సంస్కరణల్లో భాగంగా, రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు ఇతర సేవలను ఈ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. ఇది విద్యుత్ సంస్థల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రాజకీయాలకు అతీతంగా ఆలోచించగలిగితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆలోచనలు నిర్మాణాత్మమైనవే అని ఎవరికైనా అనిపిస్తుంది. కాకపోతే...అమలులో జాప్యం...వేటికి ప్రాధాన్యం? ఎంత త్వరగా పూర్తి చేస్తారు అన్నవిషయాలపైనే సీఎం విజయం ఆధారపడి ఉంటుంది.