తెలంగాణ మొదటి విడుత కంప్లీట్.. ఆశ్చర్యం కల్పించే ఎన్నికల చిత్రాలు..
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవానిలో జరిగిన ఈ ఘటన, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంత విచిత్రమైన మలుపులు తిరుగుతాయో మరోసారి రుజువు చేసింది.
By: Tupaki Political Desk | 13 Dec 2025 4:55 PM ISTగ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం స్థానిక పాలన కోసం జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రమే కాదు. అవి గ్రామీణ సమాజంలోని ఆశలు, ఆగ్రహాలు, కష్టాలు, అదృష్టాలు అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తాయి. తెలంగాణలో తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇందుకు అద్దం పట్టాయి. ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు చూస్తే.. ప్రజాస్వామ్యం ఎంత జీవంతంగా ఉందో ఒకవైపు తెలుస్తే, మరోవైపు గ్రామీణ రాజకీయాల్లో ఉన్న విచిత్రమైన మలుపులు కూడా బయటపడుతున్నాయి.
ఈ సారి ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు..
ఈ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది బాండ్ పేపర్‌పై రాసుకున్న హామీలు. “గెలిస్తే ఇది చేస్తా, అది చేస్తా” అనే మాటలు మామూలే. కానీ కొందరు అభ్యర్థులు మాత్రం మాటలను పక్కాగా రాసి, సంతకాలు పెట్టి, బాండ్ పేపర్‌లపై ప్రజలకు హామీలు ఇచ్చారు. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, పింఛన్లకు సహాయం… ఇలా ఒకటి కాదు, రెండు కాదు. గ్రామ ప్రజలు కూడా ఆ బాండ్ పేపర్‌లను గట్టిగా పట్టుకుని, “ఇది మాట కాదు… రాత” అని చెప్పడం విశేషం. ప్రజాస్వామ్యంలో మాటకు విలువ తగ్గిపోయిందా? రాతే నమ్మకంగా మారిందా? అనే ప్రశ్నలు ఇక్కడ సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు అదృష్టం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. కొన్ని గ్రామాల్లో ఓట్లు సమానంగా పడడంతో లాటరీ తీయాల్సి వచ్చింది. అభ్యర్థుల భవిష్యత్తు బ్యాలెట్ బాక్స్‌లో కాదు, చిట్టీ చేతిలో తేలిపోయింది. జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులకు ఆ క్షణం గుండె ఆగిపోయినంత పని. చివరకు లాటరీలో పేరు వచ్చినవారు సర్పంచ్ కుర్చీలో కూర్చుంటే, మిగిలినవారు “అదృష్టం కలిసిరాలేదు” అంటూ నిట్టూర్పు విడిచారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే తుది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అదృష్టం కూడా రాజకీయాల్లో రాజ్యమేలుతుందన్న నిజం ఇక్కడ కనిపించింది.
తారాస్థానికి భావోద్వేగాలు..
ఇక ఒక్క ఓటుతో గెలుపులు.. ఇవి గ్రామ రాజకీయాల్లో భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ‘నా ఓటే ఫలితాన్ని మార్చింది’ అని కొందరు గర్వపడితే, ‘ఒక్క ఓటు తక్కువయ్యింది’ అంటూ ఓడిన అభ్యర్థులు, వారి కుటుంబాలు బాధపడ్డాయి. ఒకే ఓటు గ్రామానికి నాయకుడిని నిర్ణయించడం ప్రజాస్వామ్య బలాన్ని చూపిస్తే, అదే ఓటు రాజకీయ వైరం, వ్యక్తిగత గొడవలకు కూడా కారణమవుతోంది. గ్రామాల్లో ఎన్నికల తర్వాత కూడా మాటలు, మనసులు చల్లబడేందుకు సమయం పడుతుందన్నది ఈసారి మరింత స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన మరో ఘటన.. స్వీపర్ సర్పంచ్‌గా ఎన్నిక కావడం. గ్రామంలో శుభ్రత పనులు చేసే వ్యక్తి ప్రజల నమ్మకాన్ని పొంది, నాయకుడిగా మారడం ఒక గొప్ప సామాజిక మార్పుకు సంకేతం. కులం, డబ్బు, హోదా కంటే వ్యక్తిత్వం, సేవా భావం ముందుకు వచ్చిన సందర్భంగా దీన్ని చూడొచ్చు. ఇది గ్రామీణ ప్రజాస్వామ్యానికి ఒక మంచి సందేశం కూడా.
అయితే అన్ని కథలు సంతోషంతోనే ముగియలేదు. ఓడిపోయిన కొందరు అభ్యర్థులు ఎన్నికల ముందు ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి అడగడం, హామీలు ఇచ్చిన వాటిని వెంటనే అమలు చేయాలంటూ గెలిచిన వారిపై ఒత్తిడి తెచ్చడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇది గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న ఆర్థిక భారం, పోటీ తీవ్రతను చూపిస్తోంది. ఎన్నికలు సేవ కోసం జరగాలా? లేక పెట్టుబడి పెట్టిన డబ్బుకు రాబడి కోసం జరిగే వ్యవహారంగా మారిపోతున్నాయా? అనే ఆందోళన కూడా ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాయి. గ్రామీణ రాజకీయాలు సింపుల్‌గా ఉండవు. అవి కష్టం, అదృష్టం, వివాదాలు అన్నింటి మేళవింపు. ప్రజాస్వామ్యం ఇక్కడ పుస్తకాల్లో ఉన్నట్టు కాదు… జీవితాల్లో కనిపిస్తుంది. ఈ ఎన్నికల రచ్చ రచ్చలోనే గ్రామాల నిజమైన రాజకీయ స్వరూపం బయటపడింది. ఇప్పుడు అవసరం ఒక్కటే.. ఎన్నికలు ముగిశాక కూడా గ్రామాలు కలిసి నడవాలి, గెలిచినవారు అందరినీ తమవారిగా చూసుకోవాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్య పండుగకు నిజమైన అర్థం ఉంటుంది.
ఒటేయకుంటే డబ్బులు ఇవ్వండి..
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవానిలో జరిగిన ఈ ఘటన, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంత విచిత్రమైన మలుపులు తిరుగుతాయో మరోసారి రుజువు చేసింది. ఓటు కోసం డబ్బు.. ఓటు రాకపోతే ఆ డబ్బు తిరిగి అడగడం.. ఔరవాని గ్రామంలో సర్పంచ్ పదవికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతుతో కల్లూరి బాలరాజు పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో గ్రామంలో చాలామందికి డబ్బులు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఓటు వేయాలనే ఆశతో పెట్టుబడి పెట్టిన ఆ డబ్బే, ఫలితాల తర్వాత ఆయనకు భారంగా మారింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కల పరమేశ్ ఏకంగా 450 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడంతో బాలరాజు ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ఇక్కడితో కథ ముగిసిపోయిందనుకుంటే తప్పు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన బాలరాజు, దేవుడి ఫొటో చేతిలో పట్టుకొని గ్రామంలో ఇంటింటికీ తిరగడం మొదలుపెట్టాడు. ‘మీరు నాకు ఓటు వేశానిని దేవుడి మీద ప్రమాణం చేయండి.. ఓటేయకుంటే డబ్బులు తిరిగి ఇవ్వండి’ అంటూ వేడుకున్నాడు. ఇది రాజకీయ ప్రచారం కాదు, ఓటమి తర్వాత జరిగిన ఓ వింత యాత్ర. కొందరు గ్రామస్థులు నిజంగానే ఆయనకు డబ్బులు తిరిగి ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, అభ్యర్థి భార్య చేసిన వ్యాఖ్యలు. ‘50 లేదా 60 ఓట్ల తేడాతో ఓడిపోయి ఉంటే డబ్బులు అడిగే పరిస్థితి వచ్చేది కాదు. కానీ 450 ఓట్లతో ఓడిపోవడం అంటే ప్రజలు పూర్తిగా మోసం చేసినట్టే’ అని ఆమె చెప్పిన మాటలు, గ్రామ రాజకీయాల్లో ఓటు డబ్బు సంబంధం ఎంత సహజంగా మారిపోయిందో చూపిస్తున్నాయి. ఓటు అనేది వ్యక్తిగత నిర్ణయం అన్న భావనకంటే, డబ్బుకు బదులుగా ఇచ్చే లావాదేవీలా మారిందన్న భావన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఔరవాని ఘటనను నవ్వుతూ పక్కన పెట్టడం సులువు. కానీ ఇది రేపు మరిన్ని గ్రామాల్లో పునరావృతమయ్యే ప్రమాదాన్ని సూచిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే అభివృద్ధి, నాయకత్వం, సేవ అనే భావనకన్నా, పెట్టుబడి–లాభం అనే గణితమే నడుస్తున్నట్టు ఈ సంఘటన చెబుతోంది. ఓటమి తర్వాత డబ్బులు తిరిగి అడిగే స్థాయికి రాజకీయాలు దిగజారితే, గెలిచిన వారికీ, ఓడిన వారికీ మధ్య విశ్వాసం పూర్తిగా కరిగిపోతుంది.
