Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఎవ‌రి వ్యూహం వారిదే!

తెలంగాణలో రెండు ముఖ్యమైన పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి 2027లో ఎన్నికలు జరగనున్నాయి.

By:  Garuda Media   |   5 Aug 2026 12:20 PM IST
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఎవ‌రి వ్యూహం వారిదే!
X

తెలంగాణలో రెండు ముఖ్యమైన పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి 2027లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి (హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్), తీన్మార్‌ మల్లన్న (వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ)ల పదవీకాలం మార్చి 27, 2027తో ముగియనుంది. దీంతో ఈ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్‌గా మారనున్నాయ‌ని పార్టీలు భావిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో అధికార కాంగ్రెస్, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరపున సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆమె రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో బీఆర్‌ఎస్ ఇక్కడి నుంచి ఒక ఐఆర్ఎస్ అధికారిని లేదా ఇతర సీనియర్ నేతలను దించే యోచనలో ఉంది.

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానం: ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తీన్మార్‌ మల్లన్న కొనసాగుతున్నారు. ఈయ‌న‌కు, కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో పాటు సొంత‌గా పార్టీ కూడా పెట్టుకున్న నేప‌థ్యంలో తీన్మార్ మ‌ల్ల‌న్నకు ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం లేదు. దీంతో ఈ సీటు కోసం కాంగ్రెస్‌లో పోటా పోటీగా నాయకుల పేర్లు వినిపిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

దీనికిగాను పార్టీలు క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ: హైదరాబాద్ స్థానం కోసం సామ రామ్మోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, శివసేనారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే.. అధిష్టానం ఎవ‌రికి అవ‌కాశం క‌ల్పిస్తుంద‌న్న‌ది చూడాలి. ఇక‌, వరంగల్ స్థానం నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి(సుఖేంద‌ర్‌రెడ్డి వార‌సుడు) రేసులో ఉన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు.

మ‌రోవైపు బీఆర్ఎస్ గత వరుస ఓటముల తర్వాత ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తోంది. వరంగ ల్ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి లేదా వాసుదేవరెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. బీజే పీ పట్టభద్రుల్లో ఉన్న పట్టుతో ఈ రెండు స్థానాల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.దీంతో ఇంకా సుదీర్ఘ స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఎమ్మెల్సీ స్థానాల‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా కాంగ్రెస్‌లోనే ఎక్కువ‌గా పోటీ క‌నిపిస్తోంది. మ‌రి ఎవ‌రికి అవ‌కాశం చిక్కుతుందో చూడాలి.