Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ!

తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీకాలం ముగిసింది. అయితే ఈ స్థానాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావించడం లేదని సమాచారం. ముందుగా కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేసి, డిసెంబర్ రెండో లేదా మూడో వారంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Garuda Media   |   16 Nov 2026 1:59 AM IST
తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ!
X

తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు శ‌నివారం(14వ తేదీ)తో ఖాళీ అయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రముఖ ప్రజా కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, సీనియర్ నేత బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల ప‌ద‌వీ కాలం పూర్త‌యింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం వారికి సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ చేసింది. దీంతో ఈ మూడు ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంటుంది.

అయితే.. ఈ మూడు స్థానాలను వెంటనే భర్తీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదని తెలుస్తోంది. గవర్నర్ కోటా నామినేటెడ్ స్థానాలు కావడంతో వీటి భర్తీకి ఎన్నికల సంఘం గడువు నిబంధనలు వర్తించవు. ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకుని.. దాని ప్ర‌కారం.. గ‌వ‌ర్న‌ర్‌కు సిఫార‌సు చేయ‌నుంది. ప్ర‌భుత్వం ఎంపిక చేసిన నాయ‌కులు బ‌యోడేటా, వారి గ్రాఫ్ ఆధారంగా గ‌వ‌ర్న‌ర్ ఎంపిక చేస్తారు. అయితే.. ప్ర‌స్తుతం ఈ ఎంపిక ప్ర‌క్రియ వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిపైనే ప్ర‌భుత్వం స‌హా పార్టీ కూడా భారీ క‌స‌ర‌త్తు చేస్తోంది.

ముందుగా వివిధ కార్పొరేషన్లు, కమిషన్ల నామినేటెడ్ పదవుల భర్తీని పూర్తి చేసిన తర్వాతే, డిసెంబర్ రెండో లేదా మూడో వారంలో ఈ మూడు ఎమ్మెల్సీ పేర్లను ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నట్లు స‌మాచారం. కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌డం ద్వారా ఎమ్మెల్సీ కోటాలో పోటీని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో పార్టీకి అనుకూలంగా ఉన్న‌వారు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సామాజిక వ‌ర్గాల ప‌రంగా పార్టీకి దోహ‌ద‌ప‌డేవారు.. పార్టీకి విధేయులు ఇలా.. అన్ని కోణాల్లోనూ ఈ ద‌ఫా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను వ‌డ‌పోయ‌నున్నారు.

ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒకటి పద్మశాలీ సామాజికవర్గానికి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సిరిసిల్ల సభలో ప్రకటించారు. మిగిలిన రెండు స్థానాలను బీసీ(మున్నూరు కాపు లేదా ముదిరాజ్), బ్రాహ్మణ లేదా ఎస్సీ(మాదిగ) వర్గాలకు కేటాయించే అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీలో కసరత్తు జరుగుతోంది. ఇదిలావుంటే.. సుప్రీంకోర్టులో గ‌తంలో దాఖ‌లు చేసిన కేసుల విచార‌ణ మ‌రోసారి ఈ నెల 18న విచార‌ణ‌కు రానుంది. అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ కోటా వివాదం తలెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ కేసు రెండు సంవ‌త్స‌రాలుగా విచార‌ణ ద‌శ‌లోనే ఉంది. ఈ తీర్పును అనుస‌రించి.. ప్ర‌భుత్వం కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.