Begin typing your search above and press return to search.

హైకోర్టు వద్దంది.. రేవంత్ 'హైడ్రా రంగనాథ్'ను వదిలేస్తారా?

చెరువుల వైపు, నాలాల వైపు పొరపాటున కన్నెత్తి చూసినా.. బుల్డోజర్లతో ప్రత్యక్షమై కంటిమీద కునుకు లేకుండా చేసిన హైడ్రా ఇప్పుడు న్యాయస్థానాల గేట్ల ముందు నిలబడింది.

By:  A.N.Kumar   |   27 July 2026 9:29 PM IST
హైకోర్టు వద్దంది.. రేవంత్ హైడ్రా రంగనాథ్ను వదిలేస్తారా?
X

చెరువుల వైపు, నాలాల వైపు పొరపాటున కన్నెత్తి చూసినా.. బుల్డోజర్లతో ప్రత్యక్షమై కంటిమీద కునుకు లేకుండా చేసిన హైడ్రా ఇప్పుడు న్యాయస్థానాల గేట్ల ముందు నిలబడింది. ‘తగ్గేదేలే’ అంటూ దండయాత్రలు చేసిన ఐఏఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు సింగిల్ బెంచ్ షాక్ ఇవ్వడంతో.. "ఇప్పుడేం చేస్తారు రేవంత్ సారూ?" అని ప్రతిపక్షాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. కానీ సర్కార్ మాత్రం "గేమ్ ఇప్పుడే మొదలైంది మిత్రమా" అనే రీతిలో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు టాక్.

ఇది కేవలం రంగనాథ్ మేటర్ కాదు.. సర్కార్ ఇమేజ్ మ్యాటర్

పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ గొలుసులు, బడా బాబులు, పొలిటికల్ ప్రాభవం ఉన్న నేతలు.. ఇలా ఎవరినీ విడిచిపెట్టకుండా బుల్డోజర్ల సవ్వడితో దుమ్మురేపింది హైడ్రా. ఇప్పుడు ఒక్క సింగిల్ బెంచ్ ఆదేశంతో రంగనాథ్‌ను పక్కన పెడితే.. "మేము కొట్టిన దెబ్బకు హైడ్రా హడలిపోయింది" అని ప్రత్యర్థులు పండగ చేసుకుంటారు. అందుకే ఇది కేవలం ఒక ఆఫీసర్ ట్రాన్స్‌ఫర్ గొడవ కాదు.. రేవంత్ మార్క్ 'మాస్ ఇమేజ్' కాపాడుకునే పంచాయితీ అని సెక్రటేరియట్ వర్గాలు ముక్తకంఠంతో చెవులు కొరుక్కుంటున్నాయి.

లీగల్ రూట్.. సింగిల్ బెంచ్ నుంచి 'సుప్రీమ్' దాకా..

ప్రభుత్వం వెనక్కి తగ్గే రకం కాదుగా.. అందుకే చట్టపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని వాడేసుకోవాలని డిసైడ్ అయ్యారట... మొదట సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో 'రిట్ అప్పీల్' వేసి స్టే తెచ్చుకోవడం. "కమిషనర్ నియామకం అనేది మా ఎగ్జిక్యూటివ్ హక్కు, దీనికి ఎందుకు బ్రేకులు వేస్తారు?" అని లాయర్లతో గట్టిగా వాదించడం. ప్లాన్ - బిగా ఒకవేళ డివిజన్ బెంచ్‌లో బెడిసికొడితే.. డెల్లీ ఫ్లైట్ ఎక్కేసి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం. "ప్రజా ప్రయోజనాల కోసం కష్టపడే ఒక ఆఫీసర్‌ని ఒక కేస్ చూసి మార్చేస్తే ఎలా?" అని ఢిల్లీ పెద్దల ముందు వాదనలు వినిపించడం.

ఆక్రమణదారుల ఆశలు... సర్కార్ ప్లాన్లు

ఏదైనా ఒక కఠినమైన సంస్కరణ తెచ్చినప్పుడు, దాన్ని నడిపించే ‘రఫ్ అండ్ టఫ్’ ఆఫీసర్లను కాపాడుకోవడం ప్రభుత్వాలకు అలవాటే. రంగనాథ్ గారి దూకుడు వల్ల ఇప్పటివరకు ఎన్నో చెరువులు శ్వాస పీల్చుకున్నాయి..

కోర్టుల్లో విచారణలు ఎలా సాగుతాయి? రంగనాథ్ గారు సీటులోనే ఉంటారా లేక కొత్త ఆఫీసర్ వస్తారా? అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం... హైడ్రా స్పీడ్ తగ్గకుండా చూడటానికి రేవంత్ సర్కార్ న్యాయస్థానాల్లో చివరి బంతి వరకు పోరాడటానికి ఫుల్లుగా ఫిక్స్ అయిపోయింది.