'లైఫ్ సైన్సెస్'కు తెలంగాణ భారీ ప్రాధాన్యం.. అసలేంటిది?
తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగానే పెట్టుబడులు తీసుకువచ్చినట్టు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
By: Garuda Media | 25 Oct 2025 4:00 AM ISTతెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగానే పెట్టుబడులు తీసుకువచ్చినట్టు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్య టిస్తున్న మంత్రి.. మెల్బోర్న్‌లో నిర్వహించిన ‘ఆస్ బయోటెక్ ఇంటర్నేష నల్ కాన్ఫరెన్స్ 2025’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను `గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్`గా తీర్చి దిద్దనున్నట్టు తెలిపారు.
2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగం 250 బిలియన్ డాలర్లకు.. చేరుకుంటుందన్న మంత్రి శ్రీధర్‌బాబు దీనిపై ప్రభుత్వానికి చాలా నిశిత దృష్టి ఉందని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చేలా కార్యాచరణ రెడీ చేస్తున్నామన్నారు. ఫలితంగా 5 లక్షల మందికి ఉపాధి/ ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి బలమైన ఫ్యూచర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు.
తెలంగాణ లైఫ్ సైన్సెస్ ప్రస్తుత విలువ 80 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి సమగ్ర ‘లైఫ్ సైన్సెస్ పాలసీ’ని త్వరలోనే ప్రకటించనున్నట్టు శ్రీధర్‌బాబు వివరించారు. గత 20 మాసాల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో 63 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ` గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్`గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.
ఏమిటీ లైఫ్ సైన్సెస్
వ్యక్తుల ఆరోగ్యం, జీవన విధానాలపై జరిపే పరిశోధనలకు ఈ రంగం పెద్ద పీట వేస్తుంది. ముఖ్యంగా వివిధ రోగాలు.. కొత్తగా తలెత్తే జబ్బులపై అధ్యయనం చేయడంతోపాటు పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. కరోనా సమయంలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక భూమిక పోషించింది. అప్పటి నుంచి అన్ని రాష్ట్రాలు దీనిపై చర్చ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న ఈ రంగాన్ని మరింద డెవలప్ చేసుకునేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోంది.
