Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ ఫుడ్ లవర్స్‌కు షాక్

హైదరాబాద్ అంటేనే నోరూరించే బిర్యానీలు.. రకరకాల వంటకాలకు కేరాఫ్ అడ్రస్. దేశ విదేశాల నుంచి వచ్చే ఫుడ్ లవర్స్‌ను ఇక్కడి రుచులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే దేశంలోనే అత్యుత్తమ ఫుడ్ డెస్టినేషన్‌లలో ఒకటిగా భాగ్యనగరం గుర్తింపు పొందింది.

By:  A.N.Kumar   |   18 Jun 2026 9:34 PM IST
హైదరాబాద్‌ ఫుడ్ లవర్స్‌కు షాక్
X

హైదరాబాద్ అంటేనే నోరూరించే బిర్యానీలు.. రకరకాల వంటకాలకు కేరాఫ్ అడ్రస్. దేశ విదేశాల నుంచి వచ్చే ఫుడ్ లవర్స్‌ను ఇక్కడి రుచులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే దేశంలోనే అత్యుత్తమ ఫుడ్ డెస్టినేషన్‌లలో ఒకటిగా భాగ్యనగరం గుర్తింపు పొందింది. అయితే మీరు బయట తినేటప్పుడు బ్రాండ్ చూసి మోసపోకండి. ఎందుకంటే ఇటీవల నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు సంచలనం సృష్టిస్తున్నాయి. నగరవాసుల నమ్మకాన్ని నడిబజార్లో పడేస్తూ.. వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే పలు షాకింగ్ నిజాలు ఈ తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి.

అధికారులు గుర్తించిన ప్రధాన లోపాలు ఇవే

ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం సదరు రెస్టారెంట్ వంటగదిలోకి అడుగుపెట్టాక అక్కడ ఉన్న పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం పాటించాల్సిన కనీస ప్రమాణాలను కూడా గాలికొదిలేసినట్లు గుర్తించారు. రెస్టారెంట్‌లో ఆహారాన్ని తయారు చేసే, సరఫరా చేసే ఫుడ్ హ్యాండ్లర్లకు సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు ఏవీ అందుబాటులో లేవు. వంటలు వండడానికి, అలాగే కూల్ డ్రింక్స్, డెజర్ట్స్‌లో వాడే ఐస్ తయారీకి ఉపయోగిస్తున్న నీటి నాణ్యతకు సంబంధించిన ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు కూడా యాజమాన్యం వద్ద లేకపోవడం గమనార్హం. డెజర్ట్స్, నాన్‌వెజ్ వంటకాలు, మష్రూమ్స్, తరిగిన ఉల్లిపాయలు వంటి అత్యంత త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలను ఎప్పుడు తయారు చేశారు. ఎప్పటి వరకు వాడాలనే కనీస లేబులింగ్ లేకుండానే ఫ్రిజ్‌లలో కుక్కేసారు. ఆహార తయారీలో తుప్పు పట్టే అవకాశం ఉన్న ఐరన్ కత్తులను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు హెచ్చరించారు.

ఫంగస్ పట్టిన కూరగాయలు.. వాడిన నూనెతోనే వంటలు

ఈ తనిఖీల్లో అన్నిటికంటే ఆందోళన కలిగించిన అంశం ఏమిటంటే.. వంటశాలలో నిల్వ ఉంచిన కాలీఫ్లవర్, బంగాళాదుంపలపై స్పష్టంగా ఫంగస్ పెరిగిన ఆనవాళ్లు కనిపించాయి. కంటికి కనిపిస్తున్నా వాటినే వంటల్లో వాడుతున్నట్లు తేలింది. దీనికి తోడు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ కోసం ఒకసారి వాడిన వంటనూనెను పదే పదే వేడి చేస్తూ వాడుతున్నారు. ఆ నూనె తిరిగి వినియోగించడానికి ఏమాత్రం పనికిరాదని అధికారులు నిర్ధారించారు. ఇక పరిశుభ్రత విషయానికి వస్తే.. వంటశాల కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతానికి అతి సమీపంలోనే మూతలు లేని చెత్త బుట్టలను ఉంచారు. ఇది ఈగలు, బ్యాక్టీరియా చేరడానికి కారణమవుతుందని అధికారులు మండిపడ్డారు.

ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన.. నిపుణుల సూచనలు

ఇది కేవలం ఒక్క రెస్టారెంట్‌కే పరిమితమైన సమస్య కాకపోవడం గమనార్హం. గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని పలు విలాసవంతమైన, ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఇలాంటి దారుణమైన పరిశుభ్రత లోపాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో బ్రాండెడ్ హోటళ్లలో తినే ఆహారం ఎంతవరకు సురక్షితం అనే అంశంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ చర్యలపై హర్షం

అయితే వినియోగదారుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి సంస్థల ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ తనిఖీలను ముమ్మరం చేయడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా.. నిబంధనలు పాటించని ఆహార సంస్థలపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం ద్వారానే అంతర్జాతీయంగా పేరున్న హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీపై ప్రజల్లో మళ్లీ విశ్వాసాన్ని బలోపేతం చేయగలమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా హోటల్ యాజమాన్యాలు లాభాల కంటే ప్రజా ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిద్దాం.