Begin typing your search above and press return to search.

రేవంత్ సర్కారు ఇరుకున పడే మాట చెప్పిన కేంద్రమంత్రి

లోక్ సభలో తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ చెప్పిన తాజా మాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.. సీఎం రేవంత్ కు కొత్త తలనొప్పులు తెచ్చి పెడతాయని చెప్పక తప్పదు.

By:  Garuda Media   |   6 Aug 2025 10:04 AM IST
Centre’s Data Triggers Storm
X

లోక్ సభలో తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ చెప్పిన తాజా మాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.. సీఎం రేవంత్ కు కొత్త తలనొప్పులు తెచ్చి పెడతాయని చెప్పక తప్పదు. దీనికి కారణం..ఇంతకాలం రేవంత్ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న మాటకు భిన్నంగా అధికారిక గణాంకాలు ఉండటమే. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పటం తెలిసిందే. అందుకు తగ్గట్లే.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల భారీ మొత్తాన్ని రుణమాఫీ పథకం కింద మాఫీ చేసినట్లుగా చెప్పటం తెలిసిందే.

ఇంత భారీగా రైతుల రుణాల్ని మాఫీ చేసిన తర్వాత.. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల నెత్తిన ఉండే రుణభారం తక్కువగా ఉండాల్సి ఉంది. అందుకు భిన్నంగా తాజాగా కేంద్ర సహాయ మంత్రి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..దేశంలోనే అత్యంత ఎక్కువ రుణభారం ఉన్న రైతు కుటుంబాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలుపుకొని.. ఒక్కో రైతు కుటుంబం మీద సగటున రూ.74,121 అప్పు భారం ఉన్నట్లుగా పేర్కొన్నారు.

అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం మీదా ఉన్న అప్పు ఏకంగా రూ.1.52 లక్షలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే.. తెలంగాణ రాష్ట్రంలోని రైతు కుటుంబాల రుణం.. దేశ సగటుకు ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. అది కూడా రేవంత్ సర్కారు భారీ ఎత్తున రుణమాఫీని అమలు చేసిన తర్వాత. కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి నోటి నుంచి అధికారిక సమాచారం అనంతరం..రేవంత్ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శల జడివాన కురవటం ఖాయమని చెప్పాలి. వ్యవసాయ సహాయమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ సర్కారుపై విపక్షాలు విరుచుకుపడటమే కాదు.. రైతు కుటుంబాల మీద ఇంత భారీగా రుణం ఉండటానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.