Begin typing your search above and press return to search.

మందుబాబుల రికార్డ్... ఒక్కరోజులో రూ.333 కోట్లు లిక్కర్ హాంఫట్!

దానికి కారణం... దసరా నాడు గాంధీ జయంతి సందర్భంగా వైన్స్ షాపుల మూసివేత జరగడంతో.. మద్యం ప్రియులు ముందు జాగ్రత్త.. కొనుగోళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది.

By:  Raja Ch   |   4 Oct 2025 10:50 AM IST
మందుబాబుల రికార్డ్... ఒక్కరోజులో రూ.333 కోట్లు లిక్కర్ హాంఫట్!
X

అరచేతిని అడ్డుపెట్టి సముద్రన్ని ఆపగలరా.. పండుగ వేళ వైన్ షాపులు క్లోజ్ చేయాల్సి వచ్చినంత మాత్రాన్న మందు బాబులను ఆపగలారా? తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా సరదా చర్చ మొదలైంది. దానికి కారణం... దసరా నాడు గాంధీ జయంతి సందర్భంగా వైన్స్ షాపుల మూసివేత జరగడంతో.. మద్యం ప్రియులు ముందు జాగ్రత్త.. కొనుగోళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది.

అవును... తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఆ వివరాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా... సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో రాష్ట్రంలో మొత్తం సుమారు రూ. 419 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఇది సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారు.

ఈ క్రమంలో... పండుగకు రెండు రోజుల ముందు (సెప్టెంబర్ 30) అత్యధికంగా సుమారు రూ.333 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా... అక్టోబర్ 1న కూడా మద్యం విక్రయాలు కొనసాగి.. సుమారు రూ.86 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచే మద్యం దుకాణాల వద్ద విక్రయాలు రెట్టింపయ్యాయి.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బీరు ఏరులై పారినట్లు తాజాగా ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో తెలుస్తోంది. ఇందులో భాగంగా... 3 రోజుల్లో 6.71 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడవ్వగా... బీరు కేసులు 7.22 లక్షలు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతం కంటే ఎక్కువ అని చెబుతున్నారు!

వాస్తవానికి గత ఏడాది 2024 సెప్టెంబర్ నెలలో రూ.2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా... ఈ ఏడాది 2025 సెప్టెంబర్ నెలలో దసరా సందర్భంగా రూ.3,048 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. ఇక గతేడాది సెప్టెంబర్ లో 28.81 లక్షల కేసులు ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు జరిగగా.. ఈ ఏడాది 29.92 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి.

ఇక బీర్ కేసుల విషయానికొస్తే... 2024 సెప్టెంబర్ లో 39.71 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగగా.. 2025 సెప్టెంబర్ లో 36.46 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ లో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్న రూ.70 లక్షల విలువైన 1,258 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ శాఖ స్పెషల్ టీమ్ పట్టుకుంది.