Begin typing your search above and press return to search.

33 కాదు...17...రేవంత్ రెడ్డి మార్క్ జిల్లాలు

తెలంగాణా రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడిన నాటికి 10 జిల్లాలు ఉండేవి. వాటిని తొలి ప్రభుత్వంగా అధికారం చేపట్టిన నాటి టీఆర్ఎస్ ఏకంగా 33 జిల్లాలుగా చేసింది.

By:  Satya P   |   10 Jan 2026 9:30 AM IST
33 కాదు...17...రేవంత్ రెడ్డి మార్క్ జిల్లాలు
X

తెలంగాణా రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడిన నాటికి 10 జిల్లాలు ఉండేవి. వాటిని తొలి ప్రభుత్వంగా అధికారం చేపట్టిన నాటి టీఆర్ఎస్ ఏకంగా 33 జిల్లాలుగా చేసింది. 2022 దాకా ఏపీ అయితే పదమూడు జిల్లాలతోనే ఉంది. భొగోళికంగానే కాదు జనాభా పరంగా చూసినా ఏపీ కంటే చిన్నదిగా ఉన్న తెలంగాణా మూడు రెట్లు జిల్లాలు పెంచుకుని పోయింది అని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. పైగా జిల్లాల ఏర్పాటుకు ఒక శాస్త్రీయత కానీ ప్రామాణికత కానీ లేదని కూడా చెప్పుకొచ్చారు. ఇక పేరుకు జిల్లాలు అని ప్రకటించారు కానీ ఈ రోజుకీ అనేక చోట్ల బాలారిష్టాలు ఉన్నాయని పెద్దగా వేటికీ మౌలిక సదుపాయాలు లేవని కూడా అంటున్నారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాల విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తోంది అని అంటున్నారు.

జిల్లాల పునర్విభజనతో :

తెలంగాణాలో జిల్లాలను పునర్ విభజించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్రమైన నివేదికలను కోరుతోంది అని అంటున్నారు. అలా వచ్చిన నివేదికలను ఆసరాగా చేసుకుని ప్రజల అవసరాలు పాలనా పరంగా అనువుగా ఉండేలా జిల్లాల పునర్ విభజన చేస్తారు అని అంటున్నారు.

మండలాలూ రెవిన్యూ డివిజన్లు :

ఇదిలా ఉంటే మండలాలు రెవిన్యూ డివిజన్ల విషయంలో కూడా విభజన అన్నది ఒక విధానం లేకుండా చేశారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల వాటిని సైతం సరిచేయాలని చూస్తోంది. ఒక నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాలుగు జిల్లాలలో ఉన్నాయని కూడా గుర్తించారని చెబుతున్నారు. అలాగే ప్రజలకు పాలనాపరంగా ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయని గ్రహించే పునర్ విభజనకు పూనుకుంటున్నారు అని అంటున్నారు.

పార్లమెంట్ కి ఒక జిల్లా :

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. దాంతో ఒక పార్లమెంట్ కి ఒక జిల్లా వంతున 17 జిల్లాలుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను ఈ విధంగా చేస్తే సగానికి సగం అవుతాయి. దాని వల్ల జిల్లాల విస్తీర్ణం పెరగడమే కాకుండా కనీసంగా ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలు మండలాలు, రెవిన్యూ డివిజన్లు గుర్తించే సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నారు. అంతే కాదు ఏ నియోజకవర్గానికి చెందిన మండలం దానిలోనే ఉంచడం అలాగే పాలనావసరాలకు తగినట్లుగా రెవిన్యూ డివిజనలు చేయడం వంటి కసరత్తు కూడా ప్రభుత్వం చేస్తుంది అని అంటున్నారు.

పీవీ పేరు :

ఇక పీవీ పుట్టిన ప్రాంతాన్ని గుర్తిస్తూ ఆయన పేరుతో ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ జిల్లాలోని వంగర గ్రామం మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పూర్వీకుల నివాస ప్రాంతం. ఆయన నిజానికి లక్నేపల్లి లో జన్మించినప్పటికీ, దత్తత తీసుకున్న తర్వాత ఆయన బాల్యాన్ని గడిపిన ముఖ్యమైన ప్రదేశంగా వంగర ఉంది. దాంతో ఆ ప్రాంతంలోకి వచ్చే జిల్లాకు పీవీ పేరు పెడతారు అని అంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే ఈ చర్యల మూలంగా తెలంగాణ లో శక్తివంతమైన పటిష్టమైన శాస్త్రీయమైన జిల్లాలు వస్తాయని అంటున్నారు. వాటి ద్వారా పాలన సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని కూడా చెబుతున్నారు.