జిల్లాల కుదింపుపై రేవంత్ సర్కార్ బిగ్ డిషిజన్.. కారణం ఇదేనని స్పష్టం..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాల సంఖ్యను తగ్గించే యోచనలో ఉందనే ప్రచారం జోరందుకుంది.
By: Tupaki Political Desk | 12 Jan 2026 4:00 PM ISTపాలనా సౌలభ్యం కోసం పెంచిన జిల్లాల సంఖ్య ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ‘చిన్న జిల్లాలతో వేగవంతమైన పాలన’ అన్న నినాదంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయోగంపై ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పునరాలోచనలో పడిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హన్మకొండను వరంగల్‌లో కలిపేస్తామన్న సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రకటనతో మొదలైన ఈ చిచ్చు, ఇప్పుడు సిరిసిల్ల, సిద్దిపేట వంటి జిల్లాల ఉనికినే ప్రశ్నిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరిట ప్రభుత్వం వేస్తున్న అడుగులు అటు ప్రజల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో పెను ఉత్కంఠను రేపుతున్నాయి.
వార్తల్లోకి వచ్చిన జిల్లాల విలీనం
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాల సంఖ్యను తగ్గించే యోచనలో ఉందనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. హన్మకొండ జిల్లాను రద్దు చేసి, తిరిగి వరంగల్‌లో కలిపేస్తామన్న ఆయన ప్రకటనతో ఈ చర్చ అధికారిక రూపు దాల్చింది. ఇది కేవలం ఒక్క జిల్లాకే పరిమితమా లేక రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కుదింపు ప్రక్రియ మొదలైందా అన్న ఆందోళన ప్రతిపక్షాల్లో మొదలైంది.
బీఆర్ఎస్ గళం
జిల్లాల రద్దు అంశంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన వేగవంతంగా ఉండాలని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు వాటిని రద్దు చేయడం అంటే ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవడమేనని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేకంగా ఈ జిల్లాల్లో ఉద్రిక్తత కనిపిస్తోంది. అభివృద్ధికి చిహ్నాలుగా మారిన ఈ జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోబోమని, ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రతిపక్షం హెచ్చరిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది కేవలం పాలనాపరమైన నిర్ణయం కాదని, గత ప్రభుత్వ ముద్రను చెరిపివేయడమే కాంగ్రెస్ కుట్ర అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
పాలనా సౌలభ్యమా? రాజకీయ వ్యూహమా..?
ప్రభుత్వ వర్గాల వాదన ప్రకారం.. కొన్ని చిన్న జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు మినహా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఆర్థిక భారం పెరగడం వంటి కారణాలను సాకుగా చూపిస్తున్నారు. శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగలేదని, అందుకే సమర్థవంతమైన పాలన కోసం జిల్లాలను కుదించాల్సిన అవసరం ఉందనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. కానీ, ప్రజలకు దగ్గరైన పాలనను మళ్లీ దూరం చేస్తే వచ్చే రాజకీయ పరిణామాలను ప్రభుత్వం తట్టుకోగలదా అనేది చర్చనీయాంశం.
తీవ్రమవుతున్న నిరసనలు..
జిల్లాల రద్దు వార్తలు బయటకు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజల్లోనూ ఆందోళన మొదలైంది. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత భూముల విలువ పెరగడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో, ఇప్పుడు మళ్లీ పాత జిల్లాల్లో కలిపితే తమ ప్రాంతం వెనుకబడిపోతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్‌ను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. జిల్లాల కుదింపు అనేది తేనెతుట్టెను కదిలించడమే అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే, అది కేవలం పాలనా మార్పుగానే కాక, భావోద్వేగాలతో కూడిన రాజకీయ పోరాటంగా మారే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే, మున్సిపల్ ఎన్నికల ముందు ఈ ‘జిల్లాల మంట’ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది.
