ఇదేంది? ఫోటోల మోజు అవసరమా రేవంత్?
తాజాగా జారీ చేసే సరికొత్త డిజిటల్ రేషన్ కార్డులో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు.. సంబంధిత మంత్రిఫోటో ఉండేలా తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిచ్చింది.
By: Garuda Media | 15 Aug 2026 12:36 PM ISTకొన్ని విషయాలో ఎంత హుందాగా వ్యవహరిస్తే అంత మంచిది. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజల నాడిని ఇట్టే గుర్తించే నేతలు.. అధినేతలు.. తమ చేతికి అధికారం వచ్చినంతనే వాటిని మర్చిపోతారా? ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా.. విమర్శలు వెల్లువెత్తేలా నిర్ణయాలు తీసుకునేలా ఎందుకు వ్యవహరిస్తారు? ఉన్న తలనొప్పులు సరిపోనట్లుగా కొత్త సమస్యల్ని కొని తెచ్చుకునే విషయంలో ప్రదర్శించే ఉత్సాహం తరచూ విమర్శలకు తావిచ్చేలా ఉంటుంది. తాజాగా తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం ఇలాంటి తీరునే ప్రదర్శించింది.
తాజాగా జారీ చేసే సరికొత్త డిజిటల్ రేషన్ కార్డులో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు.. సంబంధిత మంత్రిఫోటో ఉండేలా తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిచ్చింది. రేషన్ కార్డు దీర్ఘకాలం ప్రజల వద్ద ఉండే అధికారిక పత్రం. అలాంటి వాటిపై ప్రభుత్వ ముద్ర ఉండాలే తప్పించి.. పాలకులు తమ ఫోటోలు ఉండాలన్న ఆశ.. విమర్శలకు అవకాశం ఇవ్వటమే కాదు.. ప్రజల్లో వ్యతిరేకతకు అవకాశం ఇస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి.. సంబంధిత శాఖ మంత్రి ఫోటోలు ముద్రించటం ద్వారా వచ్చే తలనొప్పులు అన్ని ఇన్ని కావు. ఎందుకంటే.. ఈ రోజు అధికారంలో ఉన్న వారు.. తర్వాతి కాలంలో ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండకుంటే.. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేస్తామని..అందులో తమ ఫోటో ఉండేందుకు చర్యలు తీసుకుంటే.. ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఇదో పెద్ద ఖర్చుగా మారటమే కాదు.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతుంటారు. అంతేకాదు.. రేషన్ కార్డులు లాంటి డాక్యుమెంట్ల మీద పాలకుల ఫోటోలు ఎందుకు? అన్నది మరో ప్రశ్న.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేషన్ కార్డులో సబ్సిడీ మీద ఇచ్చే బియ్యం లాంటి వాటిల్లో కేంద్రం వాటా కూడా ఉంటుంది నిజానికి రాష్ట్ర వాటా కంటే కేంద్ర వాటానే ఎక్కువ. అలాంటప్పుడు ఈ తరహా ఫోటో పంచాయితీలతో.. ఎవరి ఫోటోలు ఉండాలన్న దానిపై చర్చ పదే పదే జరగటం మొదలవుతుంది. రాజకీయంగా తమ అధిక్యతను ప్రదర్శించటానికే కేంద్రంలోని పాలకులే కాదు రాష్ట్రాల్లోని పాలకుల తీరు ఉంటుంది. ఇది అవసరం లేని అంశం. పాలన మీద ఫోకస్ పెంచి.. ప్రజల ఇబ్బందుల్ని గుర్తిస్తే.. రేషన్ కార్డుల మీద ఫోటోలు లేకున్నా.. ప్రజల గుండెల్లో తమ ఫోటో ఉండాలన్న ఆలోచన పాలకులు చేస్తే మంచిది.
రేషన్ కార్డుల మీద పాలకుల ఫోటోలు సాంకేతికంగా కూడా కొన్ని తలనొప్పుల్ని తెచ్చి పెడతాయి. ఉదాహరణకు.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఇవాళ ఒకరు ఉండొచ్చు. ఏడాది తర్వాత ఆయనకు వేరే శాఖ అప్పజెప్పి.. మరొకరిని మంత్రిగా నియమిస్తే.. కొత్తగా వచ్చిన మంత్రి రేషన్ కార్డులో తన ఫోటో లేకపోవటాన్ని ప్రశ్నిస్తూ.. తన ఫోటోతో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కోరితే ఏమవుతుంది? ఓవైపు ఖర్చు మరోవైపు రాజకీయఅధిక్యత కోసం అనవసర పరుగుపందెం మొదలవుతుంది. ఇలాంటి వాటికి రేవంత్ సర్కారు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. తాను సీఎం అయిన తొలినాళ్లలో తన జీవితంలో తనకు ఇంకేం అక్కర్లేదని.. తనజీవితంలో తాను సాధించాల్సింది సాధించినట్లుగా చెబుతూ.. తనను సీఎం చేసిన ప్రజల రుణాన్ని తీర్చుకోవటం.. పాలనలో తన ముద్ర చూపిస్తానని చెప్పేవారు.
మూడేళ్లు గడిచేసరికి.. పాలన మీద ముద్ర కంటే.. ఇలా ఫోటోల మీద ఫోకస్ పెట్టటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. గతంలో ఈ తరహా విన్యాసాలు ప్రదర్శించిన కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర విమర్శలు ఎదుర్కోవటమే కాదు.. అనవసరమైన తలనొప్పులు ఎదురయ్యాయని చెప్పక తప్పదు. అయినా.. ఫోటోల మీద ఈ మోజు ఏంటి రేవంత్ అంటూ ఆయన పార్టీకి చెందిన వారు సైతం లోగుట్టుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఫోటోల మీద ఫోకస్ తగ్గించి.. పాలన మీద ఫోకస్ పెంచితే మంచిది. సీఎం రేవంత్ ఏం చేస్తారో చూడాలి.
