Begin typing your search above and press return to search.

అటవీ అందాల వేదికగా తెలంగాణ పెళ్లి పీటలు

సాంప్రదాయ వివాహ వేడుకలకు భిన్నంగా ప్రకృతి ఒడిలో, చారిత్రక వైభవంలో విలాసవంతమైన వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనే నేటి తరం ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తోంది

By:  A.N.Kumar   |   5 Oct 2025 6:00 PM IST
అటవీ అందాల వేదికగా తెలంగాణ పెళ్లి పీటలు
X

సాంప్రదాయ వివాహ వేడుకలకు భిన్నంగా ప్రకృతి ఒడిలో, చారిత్రక వైభవంలో విలాసవంతమైన వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనే నేటి తరం ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే గోవా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకే పరిమితమైన డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్‌లో తెలంగాణ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 15 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని పూర్తి చేయడం ద్వారా దాదాపు 19,520 మందికి ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎంపిక చేసిన ప్రధాన డెస్టినేషన్‌ కేంద్రాలు

రాష్ట్ర పర్యాటక శాఖ అటవీ ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు.. జలవనరుల సమీపంలో డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ప్రధానంగా నాలుగు ముఖ్య ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన 'సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్' లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణను ప్రపంచ పటంలో వివాహ వేడుకల హబ్‌గా నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

* అనంతగిరి అడవులు – ప్రకృతి సోయగాల మధ్య ప్రేమ కధలు

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి అడవులు ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రం. కొండల మధ్య పొదల సోయగం, మేఘాల కమ్మదనం, ప్రశాంత వాతావరణం వివాహ వేదికలకు అద్భుతమైన నేపథ్యం. ఇక్కడ లగ్జరీ రిసార్టులు, ఓపెన్‌ గార్డెన్‌ వెడ్డింగ్‌ స్పాట్లు, ఫోటో షూట్‌ జోన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

* గోల్కొండ ప్రాతం – చారిత్రక వైభవంలో వివాహ వేడుకలు

చరిత్ర, వైభవం కలగలిసిన గోల్కొండ ప్రాతం కూడా ప్రత్యేక ఆకర్షణ. తారామతి బారాదరిలో నిర్మాణంలో ఉన్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ పూర్తయితే, హైదరాబాదు సమీపంలోనే రాయల్టీ టచ్‌తో కూడిన వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించడం సులభం కానుంది.

* అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ – అడవి మధ్య లగ్జరీ అనుభవం

ప్రకృతితో సఖ్యత కలిగిన లగ్జరీ రిసార్టులు, ఈకో ఫ్రెండ్లీ కాటేజీలు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రకృతి సన్నిధిలో వివాహం జరపడం, అతిథులు సఫారీలు, ట్రెక్కింగ్‌ అనుభవించడం వంటి అవకాశాలు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.

* నాగార్జునసాగర్‌ బుద్ధవనం – ఆధ్యాత్మికతతో విలాసం

బుద్ధవనం ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎకో రిసార్టులు, ధ్యాన కేంద్రాలు ఏర్పడితే, సాంప్రదాయ, ఆధునికత కలగలిసిన వెడ్డింగ్‌ వేదికగా ఇది మారే అవకాశం ఉంది.

పెట్టుబడులు - ఉపాధి అవకాశాలు

ఈ ప్రణాళికల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 30 ప్రాజెక్టుల కోసం అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. వీటిలో 14 పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో రూపుదిద్దుకోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రిసార్టులు, హోటళ్లు, ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.

ప్రస్తుతం డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సంపన్న కుటుంబాలు ఇకపై తమ సొంత రాష్ట్రంలోనే విలాసవంతమైన వేడుకలను నిర్వహించుకోవడానికి అవకాశం లభించనుంది. దీని వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగడమే కాక, స్థానిక వృత్తులైన ఈవెంట్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, ఫొటోగ్రఫీ రంగాలకు ఉపాధి విస్తృతం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

పర్యాటక రంగంలో కొత్త పాలసీ

తెలంగాణ పర్యాటక పాలసీ 'మీరు ఆలోచించండి, మేము అమలు చేస్తాం' అనే నినాదంతో ముందుకు సాగుతోంది. వెడ్డింగ్ ప్లానర్లకు అనుమతులు, లైసెన్సులు, లాజిస్టిక్స్ వంటి ప్రక్రియలను వేగవంతం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పురాతన కోటలు, దట్టమైన అడవులు, నదులు, సరస్సులు మరియు ఆధునిక విలాసవంతమైన హోటళ్లు – ఈ సంపదను ప్రపంచ స్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చాలని పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (TCEI) తో కలిసి పనిచేయడం ద్వారా స్థానిక వెడ్డింగ్ ఇండస్ట్రీకి బలం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, ఐటీ కేంద్రంగా మాత్రమే కాక, హెరిటేజ్‌, నేచర్‌, లగ్జరీ వెడ్డింగ్‌ టూరిజం రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలవడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.