ఒక్క వంట తగ్గింది.. తులం బంగారం సొంతం చేసుకున్న అల్లుడు
వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన సింధు వివాహం రెండు నెలల క్రితం వరంగల్ కు చెందిన నిఖిత్ తో జరిగింది. వీరి పెళ్లి అప్పట్లో తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగింది.
By: Garuda Media | 4 Oct 2025 1:37 PM ISTఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో దసరా పండుగ హడావుడే వేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో.. తెలంగాణ వారికి దసరా అంతే పెద్దది.. ముఖ్యమైంది. ఈ పండక్కి భారీగా ప్లాన్ చేసుకోవటం కనిపిస్తుంది. ఈ దసరా పండుగ వేళ తెలంగాణలోకి ఒక అల్లుడికి జరిగిన మర్యాదకు సంబంధించిన ఆసక్తికర అంశం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. అంతిమంగా ఇదంతా వారి ఇంటి వ్యవహారమే కాబట్టి లైట్ తీసుకోండన్న ముక్తాయింపును కొందరు చేస్తున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..
వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన సింధు వివాహం రెండు నెలల క్రితం వరంగల్ కు చెందిన నిఖిత్ తో జరిగింది. వీరి పెళ్లి అప్పట్లో తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగింది. పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి పండుగ కావటంతో అల్లుడ్ని ఇంటికి పిలిచారు. పెద్ద పండక్కి ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాదలతో సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసిన అత్తమామలు.. మొత్తం 101 వంటకాలతో విందు ఏర్పాటు చేసి సర్ ప్రైజ్ చేశారు.
భారీగా సిద్ధం చేసిన మెనూతో ఆశ్చర్యానికి గురయ్యాడు నిఖిత్. ఈ సందర్భంగా 101 రకాల్ని వడ్డించినట్లుగా చెబుతూ.. అందులో ఒక్క వంటకం తగ్గినా తాము తులం బంగారాన్ని గిఫ్టుగా ఇస్తామని అత్తమామలు చెప్పటంతో.. అల్లుడు సరదాగా నవ్వేసి.. లెక్కేశాడు. అతడి లెక్కలో 100 ఐటెమ్స్ మాత్రమే ఉండటంతో.. ఈసారి మరింత జాగ్రత్తగా లెక్కేశాడు. అత్తమామలు చెప్పినట్లు 101 కాకుండా 100 ఉండటంతో.. అదే విషయాన్ని అంతే సరదాగా చెప్పాడు.
దీంతో.. ఆశ్చర్యపోయిన వారు..తమ లెక్క ఎలా తగ్గిందనుకుంటూ మరోసారి లెక్కేయటం.. అల్లుడి లెక్క సరికావటంతో.. నిఖిత్ షార్ప్ నెస్ కు మురిసిపోయారు. అల్లుడికి ఇచ్చిన మాటకు తగ్గట్లే తులం బంగారం ఇవ్వటం ఆసక్తికరంగామారింది. మొత్తంగా భారీ విందు మాత్రమే కాదు.. ఈ తెలివైన అల్లుడు తులం బంగారాన్ని సొంతం చేసుకున్నాడు.
అయితే.. ఇలా తులం బంగారం తీసుకోవటం బాగోలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నా.. సరదాగా జరిగిన ఈ ఉదంతాన్ని అంతే లైట్ గా తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది. ఇస్తానన్నది అత్తమామలు.. ఇచ్చింది అల్లుడికి. అంటే.. కూతురికే కదా ఏమైనా.. ఇలాంటి సరదాలు జీవితంలో మర్చిపోలేని అనుభూతులుగా మిగులుతాయని మాత్రం చెప్పక తప్పదు.
