టీ-కాంగ్రెస్‌లో 'పాదయాత్ర' పాలిటిక్స్
ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్రకు రెడీ అయ్యారు.
By: Garuda Media | 11 Aug 2025 4:00 PM ISTతెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఏడాదిన్నర కాలంలో చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు అనేక రూపాల్లో వారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఒక దఫా ఆయన పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు చేపట్టే యాత్రకు డిఫరెన్స్ ఉంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి సమాయత్తం చేయడమే లక్ష్యంగా మహేష్ గౌడ్ పాదయాత్ర చేయనున్నారు.
అయితే.. ఈ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్.. మీనాక్షి నటరాజన్.. పాదయాత్ర చేస్తే.. అది మరింత లాభిస్తుందన్నది సీనియర్ల వాదన. ఆమెకు మహిళల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. కానీ, ఈ విషయంలో మహేష్‌గౌడ్ మాత్రం ఈ ఆలోచన తనదేనని.. తానే ప్రజలను కలుస్తానని చెబుతున్నారు. మరోవైపు మహేష్ గౌడ్ ఆలోచనపైనా.. సీనియర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన చాలా పెద్ద వ్యూహంతోనే ఉన్నారని చెబుతున్నారు.
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ దఫా బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీనికి గాను ముందుగానే మహేష్‌గౌడ్ కర్చీఫ్ వేస్తున్నారన్నది రెడ్డి సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్న టాక్. అందుకే ఆయన సీఎం రేవంత్‌రెడ్డితో విభేదిస్తున్నారని కూడా అంటున్నారు. రేపు ప్రజల మధ్యకు వెళ్లి మరింత బలం పుంజుకునే వ్యూహంతోనే మహేష్‌గౌడ్ పాదయాత్రకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు. అయితే.. దీనిని మహేష్‌గౌడ్ తిప్పికొడుతున్నారు.
తనకు అలాంటి ఉద్దేశం లేదని.. పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా.. వారికి మద్దతు ఇస్తామని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు. కానీ, అంతర్గత సమావేశాలకు పిలిచినా రావడం లేదని, పార్టీ పరంగా ఆయన కొత్త అజెండాలు వేసుకుని.. వాటి ప్రకారం వ్యవహరిస్తు న్నారని.. ఇప్పుడు పాదయాత్ర కూడా దానిలో భాగమేనని చాలా మంది చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. మహేష్ గౌడ్ వ్యవహారం.. పార్టీలో చర్చకు దారితీసింది.
