కోట్లు తిన్నారు.. కాంగ్రెస్ లో చిన్నారెడ్డి రేపిన చిచ్చు
తెలంగాణ కాంగ్రెస్ మార్క్ "సహజ సిద్ధమైన అంతర్గత ప్రజాస్వామ్యం" మరోసారి మైకు ముందే కాదు.. ప్రజా క్షేత్రంలోనూ బద్దలైంది.
By: A.N.Kumar | 17 Aug 2026 12:16 PM ISTతెలంగాణ కాంగ్రెస్ మార్క్ "సహజ సిద్ధమైన అంతర్గత ప్రజాస్వామ్యం" మరోసారి మైకు ముందే కాదు.. ప్రజా క్షేత్రంలోనూ బద్దలైంది. "నా ఓపిక నశిస్తోంది జాగ్రత్త.. ఇక నేను కూడా సీనియర్ నేత జీవన్‌రెడ్డి బాటలోనే తిరుగుబాట పడతా" అంటూ మాజీ మంత్రి, సీనియర్ నేత జి. చిన్నారెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు హస్తం పార్టీలో కాక రేపుతోంది.
సోనియా గాంధీ స్వయంగా "పాపం చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ ఇవ్వండి.. ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేకపోతే పార్టీ ఫండ్స్ నుంచే చూసుకోండి" అని రేవంత్ రెడ్డికి కబురు పంపారట. కానీ మన ఎన్నికల కమిటీ బాబులు ఊరుకుంటారా? సోనియా మాట కంటే 'నోట్ల మూట'కే ప్రాధాన్యమిచ్చి.. మేఘారెడ్డికి టికెట్ ఇచ్చేశారని చిన్నారెడ్డి ఆవేదనతో పాటు ఆరోపణల అస్త్రాన్ని ప్రయోగించారు. అధిష్ఠానం మాటకే విలువ లేకపోతే.. ఇక సీనియర్ల మాటను ఎవరు వింటారనేది ఆయన మార్క్ ప్రశ్నా బాణం..
ఇక ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. నియోజకవర్గాన్ని అవినీతిమయం చేశారని.. అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఐటీ టవర్ పనులు, నర్సింగాయిపల్లి పీజీ సెంటర్ రూ.9 కోట్ల గర్ల్స్ హాస్టల్, రూ.15 కోట్ల బాయ్స్ హాస్టల్ పనులకు ఎమ్మెల్యే గారే స్పీడ్ బ్రేకర్లు వేశారట. కారణం ఏంటయ్యా అంటే... ఆ కాంట్రాక్టర్ మనాయన కాదు అని.. "మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కలిసి కోట్లు నమిలేశారు.. నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తే చూస్తూ ఊరుకోను" అని చిన్నారెడ్డి హెచ్చరించారు.
మొత్తానికి కాంగ్రెస్‌లో పదవులు, టికెట్లు రాని సీనియర్ల అసంతృప్తి 'జీవన్‌రెడ్డి బ్రాండ్' తిరుగుబాటు రూపంలో రూపాంతరం చెందుతుండటం.. శ్రేణులకు సరికొత్త పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏ రేంజ్‌లో రియాక్ట్ అవుతారో.. అధిష్ఠానం ఈ అసంతృప్తి మంటలను ఎలా చల్లారుస్తుందో వేచి చూడాలి!
