Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌లో ‘కోల్డ్ వార్’..? సీఎం రేవంత్ వ్యాఖ్యలతో విభేదించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

By:  A.N.Kumar   |   15 Jun 2026 10:55 AM IST
కాంగ్రెస్‌లో ‘కోల్డ్ వార్’..? సీఎం రేవంత్ వ్యాఖ్యలతో విభేదించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
X

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన తరుణంలో.. కీలక నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యల దుమారం పూర్తిగా చల్లారకముందే.. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన 'హిట్లర్' వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవించను.. పీసీసీ చీఫ్ క్లారిటీ

ఇటీవల ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. గతంలో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలనలో కొన్నిసార్లు హిట్లర్ లాంటి కఠిన నిర్ణయాలు కూడా అవసరమనే కోణంలో వ్యాఖ్యానించారు. దీనిపై యాంకర్ ప్రశ్నించగా పీసీసీ చీఫ్ ఏమాత్రం సంకోచించకుండా తన అసంతృప్తిని బయటపెట్టారు. "సీఎం రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. హిట్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒక క్రూరమైన నియంతగా.. విలన్‌గా భావిస్తారు. అలాంటి వ్యక్తిని ఎవరూ ఆదర్శంగా తీసుకోలేరు.. ఆయన చర్యలను సమర్థించలేం" అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ అంశంపై ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టాన వర్గాల్లో కూడా అంతర్గతంగా చర్చ జరిగినట్లు ఆయన వెల్లడించడం విశేషం. గాంధీ సిద్ధాంతాలను నమ్మే కాంగ్రెస్ పార్టీలో ఇలా నియంతల ప్రస్తావన రావడం సరికాదనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది.

హైడ్రా చర్యలపై కీలక వ్యాఖ్యలు

ఇదే ఇంటర్వ్యూలో హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా పనితీరుపై కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలో చెరువుల పరిరక్షణకు.. అక్రమ నిర్మాణాల తొలగింపునకు హైడ్రా చర్యలు అవసరమేనని ఆయన అంగీకరించారు. అయితే అదే సమయంలో బాధితుల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చారు. హైడ్రా చర్యల వల్ల పేదలకు లేదా ఎవరికైనా అన్యాయం జరిగిందని తన వద్దకు వస్తే, వారికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. కొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అధికారుల తొందరపాటు చర్యల వల్ల తప్పులు జరిగి ఉండవచ్చని.. అలాంటి వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

తెరపైకి అంతర్గత విభేదాలు.. ప్రతిపక్షాల విమర్శలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయానికి భిన్నంగా రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి లాంటి పీసీసీ చీఫ్ బహిరంగంగా స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు అస్త్రంగా మార్చుకున్నారు. "ముఖ్యమంత్రి వైఖరి పార్టీ నేతలకే నచ్చడం లేదనడానికి ఇదే నిదర్శనం" అని గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో తనపై వచ్చిన నెగెటివ్ కథనాల వెనుక కాంగ్రెస్ పార్టీలోని కొందరు కీలక నేతల హస్తం ఉందనే అనుమానంతో పీసీసీ చీఫ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన కొందరు ముఖ్య నేతలతో కాస్త దూరంగానే ఉంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

మొత్తానికి షబ్బీర్ అలీ వ్యాఖ్యల వివాదం.. పీసీసీ చీఫ్‌పై మీడియా కథనాలు.. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్ స్టేట్‌మెంట్స్.. ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్‌లో 'కోల్డ్ వార్' నడుస్తోందనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతాయో చూడాలి.