Begin typing your search above and press return to search.

కొండా పాలిటిక్స్‌పై క‌ర్ణాట‌క‌లో 'రాజ‌కీయం?!'

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌నంగా మారిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం.. అనంత‌రం పార్టీ తీసుకునే చ‌ర్య‌లు వంటివి హాట్ టాపిక్‌గా మారాయి.

By:  Garuda Media   |   28 Aug 2026 8:33 AM IST
కొండా పాలిటిక్స్‌పై క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం?!
X

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌నంగా మారిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం.. అనంత‌రం పార్టీ తీసుకునే చ‌ర్య‌లు వంటివి హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై క్ర‌మ శిక్ష‌ణ క‌మిటీ తీవ్ర స్థాయిలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఫార‌సు చేసిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలావుంటే.. గ‌త రెండు రోజులుగా ఈ విష‌యంపై ఎవ‌రూ మాట్లాడడం లేదు. పైగా.. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కూడా.. తెర‌వెనుక ఏదో జ‌రుగుతోంద‌న్న‌వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

రెండు రోజులుగా..

గ‌త రెండు రోజులుగా క‌ర్ణాట‌క‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలి సింది. క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ వ‌ద్ద ఈ వ్య‌వ‌హారంపై పంచాయ‌తీ పెట్టార‌ని.. ఈ క్ర‌మంలో అక్క‌డ ప‌రిష్కారం చేసుకునే దిశ‌గా కొండా సురేఖ కూడా మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు. ఇక‌, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సైతం.. క‌ర్నాట‌క‌లోనే తిష్ట‌వేయ‌డం.. సీఎం శివ‌కుమార్‌తో ఆయ‌న రెండు సార్లు భేటీ కావ‌డం కూడా ఈ వ్య‌వ‌హారం చుట్టూనే తిరుగుతోంది.

షార్ప్ షూట‌ర్‌గా పేరున్న క‌ర్ణాట‌క సీఎం శివ‌కుమార్‌.. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో జాగ్రత్త‌గా అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు ఆయ‌న వ‌ద్ద పంచాయ‌తీ పెట్ట‌డం వెనుక కూడా రీజ‌న్ ఇదేన ని భావిస్తున్నారు. సురేఖ‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో త‌గ్గేది లేద‌ని చెబుతున్నా.. ఇలా చేస్తే.. ప్ర‌త్యర్థి పార్టీల‌కు.. ముఖ్యంగా.. బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌న్న చ‌ర్చ కూడా సాగుతోం ది. మ‌హిళా మంత్రిపై చ‌ర్య‌లు తీసుకున్నార‌న్న అప‌ప్ర‌ద వ‌స్తుంద‌న్న వాద‌న కూడా ఉంది.

ఇదే విష‌యాన్ని ప‌రోక్షంగా అనిరుధ్ రెడ్డి చెప్పుకొచ్చారు. మ‌హిళ‌లు ఏమ‌న్నా..మౌనంగాఉండ‌డ‌మే మంచిద‌న్న‌ట్టుగా త‌న‌కు పార్టీ పెద్ద‌లు సూచించార‌ని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సైతం మంత్రి సురేఖమ్మ విష‌యంలో మౌనంగా ఉండాల‌న్నార‌ని చెప్పారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సురేఖ వ్య‌వ‌హారం క‌ర్నాట‌క‌లో తీసుకునే నిర్ణ‌యం.. జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌పైనే ఆధార‌ప‌డి ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో మ‌హిళా సెంట్రిక్‌గా రాజ‌కీయాలు చేసేందుకు బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నించే అవ‌కాశాల పైనా అంచ‌నాలు వేస్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.