Begin typing your search above and press return to search.

గ్రామీణం-రైతులు-విద్య‌.. మూడు రంగాల‌కు రేవంత్ పెద్ద‌పీట‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో మూడు కీల‌క రంగాల‌కు పెద్ద‌పీట వేసింది.

By:  Garuda Media   |   20 March 2026 10:39 PM IST
గ్రామీణం-రైతులు-విద్య‌.. మూడు రంగాల‌కు రేవంత్ పెద్ద‌పీట‌!
X

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో మూడు కీల‌క రంగాల‌కు పెద్ద‌పీట వేసింది. మొత్తం 3,24,234 కోట్ల‌ రూపాయ‌ల‌తో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో మేజ‌ర్ కేటాయింపులు ఈ మూడు రంగాల‌కే ఉండ‌డం గ‌మ‌నార్హం. వీటిలో గ్రామీణ ప్రాంతాల‌కు సంబంధించిన పంచాయితీరాజ్ వ్య‌వ‌స్థ‌కు.. అత్య‌ధిక కేటాయింపులు చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.33,688 కోట్లు కేటాయించారు. త‌ర్వాత‌.. విద్య‌కు ప్రాధాన్యం ఇస్తూ.. రూ.26,674 కోట్లు కేటాయించారు. మూడో స్థానంలో రైతుల సంక్షేమానికి రూ.23,179కోట్లు ఇచ్చారు.

ఇక‌, త‌ర్వాత ప్రాధాన్యాల్లో విద్యుత్ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.21,28 5 కోట్లు కేటాయించారు. వైద్యానికి రూ.13,679కోట్లు ఇచ్చారు. అయితే.. వైద్య రంగానికి ఈ నిధులు స‌రిపో వ‌ద్ద‌న్న వాద‌న ఉంది. గ‌తంలోనూ త‌క్కువ‌గానే కేటాయించార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ,రైతుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంతో ఈ ద‌ఫా కూడా వైద్యానికి త‌క్కువ‌గానే కేటాయింపులు జ‌రిగాయి.

యువ‌తకు నైపుణ్యాలు నేర్పుతామ‌ని.. వారిని పారిశ్రామిక వేత్త‌లుగాతీర్చిదిద్దుతామ‌ని చెబుతున్న ప్ర‌భు త్వం ఈ రంగానికి కేవ‌లం 6 వేల కోట్లు(రాజీవ్ యువ వికాసం) మాత్ర‌మే కేటాయించింది. మ‌రింత నాసిర‌కంగా.. కార్మికుల సంక్షేమానికి రూ.999 కోట్లు విదిలించ‌డం గ‌మ‌నార్హం. మహిళా శిశు సంక్షేమం ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. దీనికి రూ.3,143 కోట్లు కేటాయించారు.

ఇక‌, ఎస్సీ సంక్షేమానికి గ‌తం కంటే కొంత మేర‌కు ఎక్కువ‌గా రూ.11,784 కోట్లు కేటాయించారు. ఎస్టీ సంక్షేమానికి కూడా అదే ర‌కంగా.. రూ.7,937కోట్లు కేటాయించారు. ఇక‌, కీల‌క‌మైన బీసీల సంక్షేమానికి రూ.12,511 కోట్లు మాత్ర‌మే కేటాయించారు. మ‌రో కీల‌క‌మైన ప్రాధాన్యం ఉన్న పేద‌ల ఇళ్ల నిర్మాణానికి 7400 కోట్ల రూపాయ‌ల‌ను మాత్ర‌మే కేటాయించ‌డం గ‌మ‌నార్హం. ఇది ఏమూల‌కూ స‌రిపోద‌న్న పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి.

ఐటీ రంగానికి రూ.875 కోట్లు కేటాయించారు. పరిశ్రమలకు రూ.3,490 కోట్లు, చేనేతకు రూ.258 కోట్లు మాత్ర‌మే కేటాయించారు. నీటి పారుద‌ల‌, ప్రాజెక్టుల‌కు అత్య‌ధికంగా రూ.22,615 కోట్లు కేటాయించ‌డం గ‌మ‌నార్హం. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ నిధులు ఏమేర‌కు స‌రిపోతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇక‌, రవాణా శాఖకు రూ.12,759 కోట్లు కేటాయించారు. అయితే.. దీనిలో `మ‌హిళా శ‌క్తి` ప‌థ‌కానికి నిధులు వెచ్చించాలి. అంటే సింహ‌భాగం నిధులు ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణానికే వెచ్చించాల్సి ఉంటుంది.