జూబ్లీహిల్స్ బైపోల్ ట్విస్టు.. కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చిన అజ్జూభాయ్
వెటరన్ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ యూటర్న్ తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన అజారుద్దీన్ త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Political Desk | 6 Oct 2025 2:02 PM ISTవెటరన్ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ యూటర్న్ తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన అజారుద్దీన్ త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనను ఎమ్మెల్సీగా పంపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండగా, ఎమ్మెల్సీ పదవిపై తనకు ఆసక్తి లేదని ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని అజారుద్దీన్ పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందు ఎమ్మెల్సీ పదవికి ఓకే చెప్పిన అజారుద్దీన్.. అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించడం, ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుపట్టడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. స్థానిక ఎన్నికలు ఒకవైపు.. జూబ్లీహిల్స్ ఉప పోరు మరోవైపు అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి నగరంలో కాంగ్రెస్ పట్టు సాధించినట్లు చెప్పుకోడానికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సరైన అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన ఓ యువ నాయకుడిని ఆయన ఎంపిక చేశారని, అతడి పేరును ప్రకటించాలని అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు టికెట్ ఇవ్వమని సూచించడంతో నగరానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు మరికొందరు జూబ్లీహిల్స్ టికెట్ కావాలంటూ పైరవీలు మొదలుపెట్టారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ నిన్నమొన్నటి వరకు పోటీకి దూరంగా ఉంటానని చెబుతూ, ఆకస్మాత్తుగా తనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ను కోరినట్లు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్ ను బరిలోకి దింపింది. అయితే ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన పేరు ప్రకటించడం, ప్రచారం చేయడానికి కూడా సమయం చాలకపోవడం వల్ల అజారుద్దీన్ ఓటమి మూటగట్టుకున్నారు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన గత కొంతకాలంగా నగరంలో కాంగ్రెస్ రాజకీయాలలో చురుగ్గా తిరుగుతున్నారు. అయితే ఆయన క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ ను మరోసారి రంగంలోకి దింపితే నష్టపోతామని భావించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నామినేట్ చేస్తామని ప్రకటించింది. దీంతో అజారుద్దీన్ మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి సై చెప్పారని అంటున్నారు. అయితే సడన్ గా ఏమైందో కానీ ఆయన ఆకస్మికంగా తన మనసు మార్చుకున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటాపై న్యాయ వివాదాలు ఉన్నందున తనకు ఎమ్మెల్సీ వద్దని అజారుద్దీన్ చెబుతున్నారని అంటున్నారు. తాను గతంలో పోటీ చేసిన జూబ్లీహిల్స్ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని అజారుద్దీన్ తెగేసి చెబుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి ఒకరు తనను తప్పుదారి పట్టిస్తున్నారని పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని అంటున్నారు.
దీంతో కాంగ్రెస్ రాజకీయాల్లో అజారుద్దీన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ పదవికి అంగీకరించిన ఆయన ఆకస్మికంగా తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో గందరగోళం రేపడానికి మైనార్టీ ఓట్లను చీల్చడానికి విపక్షం ప్రయత్నాలు చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అజారుద్దీన్ ను రెచ్చగొట్టడం ద్వారా మైనార్టీ ఓట్లకు గండికొట్టే ప్లాన్ జరుగుతుందేమోనని అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. అజారుద్దీన్ ను ఒప్పించేందుకు కొందరు సీనియర్ నేతలను రంగంలోకి దింపారని చెబుతున్నారు. దీంతో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై హైడ్రామా కొనసాగుతోంది.
