ఏపీకి సవాల్‌గా.. తెలంగాణ సీఎంలు.. !
ఈ విషయంలో ఎవరు అడ్డు వస్తారో.. చూస్తాం.. అంటూ ఏకంగా ప్రధాని, ఏపీ సీఎం, మాజీ సీఎం జగన్ పేర్లను కూడా అసెంబ్లీలోనే ప్రస్తావించారు.
By: Garuda Media | 6 Jan 2026 9:00 PM ISTఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రుల నుంచి సవాళ్లు మాత్రం కామన్‌గా ఉంటున్నాయి. ఇదే సమయంలో వీటిని ఎదిరించేందుకు బలంగా ప్రయత్నించేందుకు ఏపీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన రెండు వ్యాఖ్యలు.. సవాళ్లు కూడా చేశారు. తమకు కేటాయించిన కృష్ణా జలాల్లో 45 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని చెప్పారు. ఒకవేళ అలా కాకపోతే.. 75 టీఎంసీల నీటిని బలంగా గుంజుకుంటామన్నారు.
ఈ విషయంలో ఎవరు అడ్డు వస్తారో.. చూస్తాం.. అంటూ ఏకంగా ప్రధాని, ఏపీ సీఎం, మాజీ సీఎం జగన్ పేర్లను కూడా అసెంబ్లీలోనే ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు చాలా బలమైనవి. కానీ.. ఏపీలో దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇక, మరో కీలక విషయం.. తాను బలంగా పోరాడి.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును నిలిపి వేయించానని చెప్పారు. ఇది కూడా.. ఏపీకి, ముఖ్యంగా సీమ ప్రాంతానికి శరాఘాతం. అయినా.. ఏపీలో మాత్రం ఎవరూ స్పందించలేదు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. గతంలో కేసీఆర్ కూడా.. జలాల విషయంలో ఏపీ పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. నాగార్జునసాగర్ కుడి గట్టులో నీటి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇది లిమిట్‌కు మించి చేస్తున్నారని.. దీనివల్ల తమకు ఇబ్బంది వస్తుందని చెప్పినా.. ఆయన వెనక్కి తగ్గలేదు. దీనిపై తాడో పేడో తేల్చుకుంటామని.. అవసరమైతే.. ఈ ప్రాజెక్టును కేంద్రానికి బదలాయించినా ఇష్టమే నని సవాల్ రువ్వారు. అప్పట్లోనూ ఎవరూ మాట్లాడలేకపోయారు.
ఇక, అప్పట్లో సీమ ఎత్తిపోతల ప్రాజెక్టను చేపట్టేందుకు జగన్ ప్రభుత్వం ముందుకు రాగా.. ఆ సమయంలో నూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఒకవైపు రాయలసీమకు న్యాయం చేస్తామన్న ఆయన.. హైదరాబాద్ కు చేరగానే.. సీమ ఎత్తిపోతలపై విమర్శలు గుప్పించారు. ఇలా.. ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఏపీ విషయంలో ఒకే తరహా వైఖరిని ప్రదర్శిస్తుండడాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగానే పరిగణిస్తున్నారు. దీనిపై ఏపీలో ఎవరూ నోరు విప్పకపోవడంపై మరింత విస్మయం వ్యక్తమవుతోంది.
