Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ రెడ్డి అంత సీరియస్ ఎందుకయ్యారు?

సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈసారి మాత్రం తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు.

By:  A.N.Kumar   |   19 Oct 2025 3:33 PM IST
సీఎం రేవంత్ రెడ్డి అంత సీరియస్ ఎందుకయ్యారు?
X

సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈసారి మాత్రం తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. తాను ఇచ్చిన ఆదేశాలను, ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ఉద్యోగులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు, అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

* 'పల్లె నిద్ర'పై ప్రత్యేక దృష్టి

ముఖ్యంగా జిల్లాల స్థాయిలో జరగాల్సిన క్షేత్రస్థాయి పర్యటనలు.. 'పల్లె నిద్ర' కార్యక్రమం అమలు లోపించడంపై సీఎం తీవ్ర అసంతృప్తి చెందారు. "నేను చెప్పిన తర్వాత కూడా మీరు చేయకపోతే ఏం చేయాలి?" అని ఆయన అధికారులను సూటిగా ప్రశ్నించారు. గత నెలలో నిర్ణయించిన 'పల్లె నిద్ర'లో కేవలం ఒకరు లేదా ఇద్దరు కలెక్టర్లు మాత్రమే చురుకుగా పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు.

ములగు కలెక్టర్‌కు ప్రశంస

ములుగు జిల్లా కలెక్టర్‌ను ఉదాహరణగా పేర్కొంటూ ఆయనను ప్రశంసించారు. "అతను గురుకుల పాఠశాలలను సందర్శించి, అక్కడే పల్లె నిద్ర చేస్తూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇదే నిజమైన సేవాభావం" అని సీఎం వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పని చేయాలని మిగతా అధికారులకు సూచించారు.

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశం 'ప్రతి పని రికార్డు కావాలి'

ప్రభుత్వ పథకాలు ప్రజల వరకు సరిగ్గా చేరడం లేదని, క్షేత్రస్థాయిలో చురుకుదనం కొరవడటంతో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల పనితీరు సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై జీరో టాలరెన్స్ ప్రకటించిన సీఎం, తన ఆదేశాలను పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. "ప్రతి పని రికార్డు కావాలి. తడబాట్లు ప‌నికిరావు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నదీ స్పష్టంగా ఉండాలి" అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే మంత్రులు కొండా సురేఖ, పొన్న ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌లకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు కూడా ఈ ఆగ్రహానికి కారణమని సమాచారం.

* సామాజిక బాధ్యతపై కీలక వ్యాఖ్యలు: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత!

పాలనాపరమైన హెచ్చరికలతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సామాజిక బాధ్యత అంశంపై కూడా కీలక ప్రకటన చేశారు. "తమ తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాలను కట్ చేస్తాం. అలాంటి వారిని వదిలిపెట్టం. తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్చితే వారి జీతం నుంచి డబ్బు కట్ చేసి, ఆ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తాం" అని ఆయన హెచ్చరించారు.

ఉన్నతాధికారి ఘటనపై స్పందన

ఇటీవల మహబూబ్‌నగర్‌లో ఓ ఉన్నతాధికారి తన తల్లిదండ్రులను అనాథాశ్రమంలో చేర్చిన సంఘటనపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో త్వరలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కూడా ఆయన ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ హెచ్చరికలు అధికారులు, ఉద్యోగులకు స్పష్టమైన సంకేతాలు పంపాయి. ఇకపై నిర్లక్ష్యం, ఆలస్యం, తడబాటు పనికిరావు. ప్రజలకు చేరే విధంగా పని చేయకపోతే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.