వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారం.. రేవంత్ చెప్పిన లాజిక్ ఇదీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: A.N.Kumar | 9 Nov 2025 6:50 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న పదేళ్లపాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికల తేదీపై స్పష్టత
జమిలీ ఎన్నికల ప్రతిపాదనను స్పష్టంగా తోసిపుచ్చారు సీఎం రేవంత్. ఆయన మాట్లాడుతూ "2028లో కాదు, ఖచ్చితంగా 2029 జూన్‌లోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు.. 2034 జూన్ వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది" అని ప్రకటించారు.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత బలమైన పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఒక ఉవ్వెత్తున ప్రభావితం చూపిన తెలుగుదేశం పార్టీ, ఈరోజు లేదు. గతంలో ప్రజలు టీడీపీకి, కాంగ్రెస్‌కు, చంద్రశేఖర్ రావుకి చెరో పది సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చారని గుర్తు చేస్తూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా మరో పది సంవత్సరాలు అవకాశం ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పదేళ్ల కాలంలో శతాబ్దానికి సరిపోయే అభివృద్ధి సాధిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
గత సీఎంల విధానాలే ప్రేరణ
తమ ప్రభుత్వం గత ముఖ్యమంత్రులు అవలంబించిన అభివృద్ధి దిశనే కొనసాగిస్తుంది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్రను, ముఖ్యంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు , వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన ఐటీ పునాది కారణంగానే నేడు హైదరాబాద్ ‘నాలెడ్జ్ హబ్’గా నిలబడిందని ఆయన గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు , ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక వసతులు హైదరాబాద్‌కు జీవనాడిలా మారాయని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దూరదృష్టి నిర్ణయాల వల్లే నేడు హైదరాబాద్ జీసీసీలు, డేటా సెంటర్లకు హబ్‌గా ఎదిగిందని ఆయన అన్నారు.
కేసీఆర్‌పై వ్యంగ్య చమత్కారం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కాంగ్రెస్ పాలనా కాలాన్ని “500 రోజులు మాత్రమే” అని పేర్కొనడంపై రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. "2025 డిసెంబర్‌కి రెండేళ్లు పూర్తయితే, అప్పుడు దాదాపు 1000 రోజులు అవుతాయి. కేసీఆర్ గారి లెక్కలు అమెరికా టైమ్‌జోన్ ప్రకారమా, లేక కలలో వేసిన లెక్కలా అర్థం కావడం లేదు" అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ దూరదృష్టి పాలన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూరదృష్టితో పాలన సాగిస్తుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. "2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి ఆగలేదు. అదే కొనసాగింపుగా 2024 నుంచి 2034 వరకు కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి దిశా నిర్దేశం చేసే శక్తిగా నిలుస్తుంది" అని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాలిక పాలనపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న అపారమైన విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత అభివృద్ధి ఫలాలను కొనసాగిస్తూ, తెలంగాణను జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామనే ఆయన హామీలు భవిష్యత్తు రాజకీయ చర్చలకు కొత్త ఊపునిచ్చాయి.
