సర్పంచ్ గా సీఎం రేవంత్ క్లాస్ మేట్... ఏమి జరిగిందంటే..?
తెలంగాణలో మరో ఎన్నికల సందడి జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
By: Raja Ch | 30 Nov 2025 10:15 AM ISTతెలంగాణలో మరో ఎన్నికల సందడి జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో.. మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ శనివారంతో పూర్తయ్యింది. ఈ క్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చూసుకుంటున్నాయి. ఈ సమయంలో కొండారెడ్డిపల్లిలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
అవును... తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేళైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తు చేపట్టారు. ఇదే సమయంలో వార్డు సభ్యుల పదవులకు కూడా ఒక్కో నామినేషన్ దాఖలు చేయించాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి ఈ దఫా సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో... గ్రామస్థులంతా సర్పంచ్ గా మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీర్మానించారు! ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... మల్లెపాకుల వెంకటయ్య, సీఎం రేవంత్ రెడ్డికి క్లాస్ మెట్! అంటే... ముఖ్యమంత్రి క్లాస్ మెట్ ఇప్పుడు సర్పంచ్ కాబోతున్నారన్నమాట.
ఈ సందర్భంగా... రేవంత్ రెడ్డి, వెంకటయ్య కలిసి స్కూలుకు వెళ్లారని.. వారి వద్ద కేవలం క్లాస్ మెట్ అనే బంధమే కాకుండా.. స్నేహితులుగా మంచి సంబంధం ఉందని చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో తన క్లాస్ మేట్ కి రేవంత్ ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం స్థానికంగా ఆసక్తిగా మారింది.
సర్పంచ్ పదవి కోసం ఎస్సై వీ.ఆర్.ఎస్.!:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పలు పంచాయతీల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సూర్యాపేట జిల్లా కోదాడ ఎస్సై వీ.ఆర్.ఎస్. తీసుకుంటున్నారు! గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు ప్రస్తుతం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పని చేస్తున్నారు.
ఆయనకు ఇంకా ఐదు నెలల సర్వీస్ మిగిలి ఉన్న నేపథ్యంలో.. తాజాగా సర్పంచ్ గా పోటీ చేయడం కోసం ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీ.ఆర్.ఎస్.) నిర్ణయం తీసుకున్నారు. కాగా... పోలీసు డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అయిన వెంకటేశ్వర్లు ఎస్సైగా పదోన్నతి పొందారు!
