బాబు బాటలో రేవంత్.. ఏం చేస్తున్నారంటే!
ఇలా..పలు పోలికలు చంద్రబాబుకు-రేవంత్ రెడ్డికి మధ్య కనిపిస్తున్నాయి. తాజాగా మరో కీలక విషయంపైనా సీఎం చంద్రబాబు మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By: Garuda Media | 23 Dec 2025 11:43 PM ISTఏపీ సీఎం చంద్రబాబు రూటులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పెట్టుబడుల సాధన నుంచి ప్రతిపక్షాలపై విమర్శల వరకు, చేసింది చెప్పుకోవడం నుంచి ప్రజల మధ్య ప్రచారం దాకా.. రేవంత్ ఇటీవల కాలంలో దూకుడుగా ఉన్నారు. అంతేకాదు, మంత్రులకు కూడా ఆయన తరచుగా చేసింది చెప్పండి.. లేకపోతే వెనుకబడిపోతాం.. అని కూడా చెబుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ.. చంద్రబాబు చేసిన, చేస్తున్న పనులే. ఆయన స్వయంగా ప్రచారం చేయడంలోనూ.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ ముందుంటారు.
ఇప్పుడు ఇదే తరహాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ఎక్కడ ఎలాంటి సమావేశం నిర్వహించినా.. దాంతో సంబంధం ఉన్నా లేకపో యినా.. తన పథకాలు.. గత 24 నెలల పాలన.. కేసీఆర్ పాలనను పోలుస్తూ.. ప్రచారంలో దంచికొడుతున్నారు. ఇక, చంద్రబా బు విజన్ 2047 అని ప్రచారం చేస్తున్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా `రైజింగ్ తెలంగాణ-2047` పేరుతో ప్రచారం నిర్వహిస్తు న్నారు. ఇక, పెట్టుబడులకు కూడాచంద్రబాబు మాదిరిగానే సీఎంరేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీని నిర్మించే పనిలోనూ నిమగ్నమయ్యారు.
ఇలా..పలు పోలికలు చంద్రబాబుకు-రేవంత్ రెడ్డికి మధ్య కనిపిస్తున్నాయి. తాజాగా మరో కీలక విషయంపైనా సీఎం చంద్రబాబు మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అధికారులు యాక్టివ్‌గా ఉండాలంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు తరచుగా చెబుతున్నారు. కలెక్టర్ల సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ 18 నెలల కాలంలో ఇప్పటి వరకు 5 సార్లు కలెక్టర్ల సదస్సులు నిర్వహించారు. 3 సార్లు శాఖల కార్యదర్శులు సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల మధ్యకు తీసుకువెళ్లేందుకు.. వాటిని వివరించేందుకు, అభివృద్దిలో పాలు పంచుకునేందుకు అధికారులతో తరచుగా సీఎం చంద్రబాబు టచ్‌లో ఉంటున్నారు.
సేమ్ టు సేమ్.. అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా.. తాజాగా అదే ప్రకటన చేశారు. కార్యదర్శులు యాక్టివ్ రోల్ పోషించాలని.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలనిఆయన ఆదేశించారు. ఈ విషయంలో వెనుకబడితే ఊరుకునేది లేదని హెఛ్చరించారు. ప్రతి నెలా కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అంతేకాదు.. కార్యదర్శులు చేస్తున్న పనులు.. అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న తీరును నివేదికల రూపంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాలని.. వాటిని తాను సమీక్షిస్తానని చెప్పడం గమనార్హం. గత పాలనలో చేసిన తప్పులు ఇప్పుడు చేయొద్దని చెప్పారు. గతానికి భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, పాలసీలు తీసుకువచ్చామని వాటికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. సో.. మొత్తంగా చూస్తే.. ఆయన పాలన విషయంలో చంద్రబాబు రూట్‌లోనే పయనిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
