రేవంత్ ప్రతి హ్యాపీ మూమెంట్ ను దెబ్బేస్తారుగా?
కొన్నిసార్లు అనిపిస్తుంది పాపం సీఎం రేవంత్ అని. ఎవరెన్ని చెప్పినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కర్త.. కర్మ.. క్రియ రేవంత్ రెడ్డి మాత్రమే.
By: Garuda Media | 12 Feb 2026 11:00 AM ISTకొన్నిసార్లు అనిపిస్తుంది పాపం సీఎం రేవంత్ అని. ఎవరెన్ని చెప్పినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కర్త.. కర్మ.. క్రియ రేవంత్ రెడ్డి మాత్రమే. కేసీఆర్ అహంకారం కావొచ్చు.. కేటీఆర్ తప్పులు మాత్రమే కాంగ్రెస్ కు అధికారం దక్కేలా చేసిందనే వాదనలు ఎన్ని వినిపించినా.. అవన్నీ ఒక ప్రాసెస్ లోకి వెళ్లి.. ఆ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లేలా చేసింది మాత్రం రేవంత్ రెడ్డేనన్న వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. అలాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా సాధించానన్న హ్యాపీనెస్ వచ్చినంతనే.. ఆ వెంటనే ఏదో ఒక పంచాయితీ తెర మీదకు రావటం.. రేవంత్ కు రావాల్సిన మైలేజీ కాస్తా ఆవిరైపోవటం కనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితి ఒకట్రెండుసార్లకు పరిమితం కాలేదు. రేవంత్ సర్కారు కొలువు తీరిన రెండున్నరేళ్లలో తరచూ కనిపించేదే. గ్లోబల్ సమ్మిట్ లో సక్సెస్ అయినా.. ఫ్యూచర్ సిటీలో అంత పెద్ద పోగ్రాంను నిర్వహించినా.. ఫుట్ బాల్ దిగ్గజాన్ని హైదరాబాద్ కు రప్పించినా.. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించినా.. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసినా.. ఏం చేసినా.. మైలేజీకి మించిన డ్యామేజ్ ను క్రియేట్ చేసేటోళ్లు కాంగ్రెస్ లో సిద్ధంగా ఉండటం కనిపిస్తుంది.
ప్లస్ అయితే పార్టీకి.. మైనస్ అయితే మాత్రం రేవంత్ ఖాతాలో వేసే సొంతోళ్ల తీరు రేవంత్ కు గుదిబండగా మారుతూ ఉంటుంది. అయినప్పటికీ పాపాలభైరవుడి మాదిరి వ్యవహరిస్తూ.. ముందుకెళ్లే వైఖరి రేవంత్ లో కనిపిస్తుంటుంది. తాజాగా ముగిసిన మున్సిపోల్స్ వేళ.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు తిరుగులేని అధిక్యత అని తేల్చి చెబుతున్న వేళ.. ఆ హ్యాపీ మూమెంట్ ను ఎంజాయ్ చేయలేని పరిస్థితి రేవంత్ రెడ్డికి నెలకొంది.
దీనికి కారణం కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి పంచాయితీ. పోలింగ్ వేళ.. తన మనిషిపై పోలీసు అధికారి ఒకరు దురుసుగా వ్యవహరించారన్న దానిపై సీరియస్ కావటమే కాదు..కెమేరాలు తనవైపు చూస్తున్న వైనాన్ని వదిలేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. దౌర్జన్యంతో విజయాన్ని సొంతం చేసుకున్నారన్న ప్రచారాన్ని షురూ చేసేలా విపక్షానికి అస్త్రాన్ని అందించారని చెప్పాలి. పంచాయితీ ఎన్నికలతో పోలిస్తే.. మున్సిపోల్స్ లో కాంగ్రెస్ సత్తా చాటినట్లుగా అంచనాలు వ్యక్తమయ్యే వేళ.. జగ్గారెడ్డి చేసిన పంచాయితీ సీఎం రేవంత్ కు కొత్త తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు. చూస్తూ.. చూస్తూ.. జగ్గారెడ్డిని ఏమీ అనలేరు. అలా అని ఊరికే ఊండలేని పరిస్థితిని క్రియేట్ చేసిన సొంతోళ్ల తీరు చూస్తే.. అయ్యో పాపం రేవంత్ అన్న భావన కలుగక మానదు.
