క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ వార్నింగ్ విన్నారా?
ద్వేషించే వారిని సైతం ప్రేమించాలనన ఏసుక్రీస్తు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచిగా పేర్కొన్న సీఎం రేవంత్.. మరో ఆసక్తికర వ్యాఖ్యను చేశారు.
By: Garuda Media | 21 Dec 2025 10:56 AM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చర్చకు తెర తీశారు. రోటీన్ కు భిన్నంగా ఆయన వ్యవహరించారని చెప్పాలి. సాధారణంగా వేడుకలు.. పర్వదినాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్యమంత్రులు కాస్తంత మృదువుగా మాట్లాడటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఆయన కాస్తంత హెచ్చరిక స్వరంతో వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలకు తావు లేదని.. ఎవరి మతానని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలన్నారు.
మత ప్రాదిపదికన దాడులు చేయాలని చూసిన వారిని.. అలాంటి ఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వం అణిచివేసిన విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ‘ఇతర మతాల్ని కించపరిస్తే శిక్షించే విధంగా కర్ణాటక తరహాలో అసెంబ్లీలో చట్టం తెస్తాం. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా.. దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించేలా ఉన్న చట్టాలను కూడా సవరిస్తాం. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తాం’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ద్వేషించే వారిని సైతం ప్రేమించాలనన ఏసుక్రీస్తు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచిగా పేర్కొన్న సీఎం రేవంత్.. మరో ఆసక్తికర వ్యాఖ్యను చేశారు. మైనార్టీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని.. అది వారి హక్కుగా పేర్కొన్న రేవంత్.. అన్ని మతాల్ని సమానంగా గౌరవించాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఓవైపు తియ్యగా మాట్లాడుతూనే.. మరోవైపు మత విద్వేషాల్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారికి వార్నింగ్ ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
