తెలంగాణలో చైల్డ్ పో*ర్న్ వ్యవహారం... పెద్ద ఎత్తున అరెస్టులు!
తెలంగాణలో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నవారికి సంబంధించిన వ్యవహారం తాజాగా షాకింగ్ గా మారింది.
By: Raja Ch | 10 Jan 2026 9:52 AM ISTతెలంగాణలో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నవారికి సంబంధించిన వ్యవహారం తాజాగా షాకింగ్ గా మారింది. లైంగిక కోరికల వ్యవహారంలో ఎవరి మనిషో, ఎవరు మనిషి రూపంలో ఉన్న మృగమో తెలియని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలు చూసేవారు ఒకరైతే.. ఏకంగా ఓ బాలికపై లైంగిక దాడి చేసి, ఆ ఘోరాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేసిన వ్యక్తి వ్యవహారం మరొకటి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వారి తాట తీసే పనికి పూనుకున్నారు!
అవును... తెలంగాణలో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నవారి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సైబర్ టిప్ లైన్ సమాచారం మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీ.ఎస్.బీ) అధికారులు ఈ మేరకు ఐపీ అడ్రస్ లను తనిఖీ చేశారు. ఈ సమయంలో 18 ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 24 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో భాగంగా... నిజామాబాద్ ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఉద్యోగి విదేశీ చిన్నారుల పోర్న్ వీడియోలు బ్రౌస్ చేస్తూ.. వాటిని డౌన్ లోడ్ చేసుకుని, తన గూగుల్ డ్రైవ్ తో పాటు మొబైల్ ఫోన్ లోనూ స్టోర్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సైబర్ టిప్ లైన్ ద్వారా మూడు ఆన్ లైన్ బ్రౌసింగ్ లను సీ.ఎస్.బీ అధికారులు గుర్తించారు. దీంతో... నిజామాబాద్ సీ.ఎస్.బీ యూనిట్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి.. సదరు జూనియర్ అసిస్టెంట్ ను అరెస్ట్ చేశారు.
మరోవైపు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కు చెందిన ఓ వ్యక్తి గతంలో ఓ ప్రైవేటు సంస్థలో హౌస్ కీపింగ్ బాయ్ గా పనిచేస్తూ.. ప్రస్తుతం ఓ కపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే.. గతంలో హౌస్ కీపింగ్ బాయ్ గా పనిచేస్తున్న సమయంలో ఓ బాలికపై లైంగిక దాడి చేసి, ఆ దారుణాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి, గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేశాడు. అయితే.. ఆ వీడియోల వ్యవహారం.. ఆన్ లైన్ లో సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టీజీ.సీ.ఎస్.బీ. దృష్టికి వచ్చింది.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. సైబర్ పెట్రోలింగ్ లో తాము గుర్తించే వరకూ తమ కుమార్తెపై లైంగిక దాడి జరిగిందనే విషయం తమకు తెలియదని సదరు బాలిక తల్లితండ్రులు చెప్పారని తెలిపారు. చిన్నారి బాలికల విషయంలో తల్లితండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత కేరింగ్ గా ఉండాలనేది ఈ ఘటన నొక్కి చెబుతుందని భావించొచ్చు.
ఈ సందర్భంగా స్పందించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. చిన్నారుల అశ్లీల చిత్రాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసినవారిని, షేర్ చేయడంతో పాటు డౌన్ లోడ్ చేసి స్టోర్ చేసుకున్నవారిని గుర్తించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేంద్రంగా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సీపీయూ) ను గత ఫిబ్రవరిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో 15 మందిని, వరంగల్ లో ముగ్గురిని, నిజామాబాద్ కు చెందిన ఇద్దరు సహా మొత్తం 24 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరంతా చైల్డ్ పోర్న్ చూడటంతో పాటు గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకున్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. ఈ సందర్భగా అరెస్ట్ అయినవారందరికీ.. వారి తల్లితండ్రుల సమక్షంలో కౌనెల్సింగ్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
