Begin typing your search above and press return to search.

కేసీఆర్ ల‌క్ష్మ‌ణ రేఖ చెరిపేసిన రేవంత్ రెడ్డి!

తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వ‌కుండా.. గ‌తంలో కేసీఆర్ గీసిన ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌ను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం చెరిపేసింది. సీబీఐ ద‌ర్యాప్తు చేయాలంటే.. ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం.. రాష్ట్ర స‌ర్కారు అనుమ‌తి తీసుకోవాలి.

By:  Garuda Media   |   3 Sept 2025 1:00 AM IST
కేసీఆర్ ల‌క్ష్మ‌ణ రేఖ చెరిపేసిన రేవంత్ రెడ్డి!
X

తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వ‌కుండా.. గ‌తంలో కేసీఆర్ గీసిన ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌ను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం చెరిపేసింది. సీబీఐ ద‌ర్యాప్తు చేయాలంటే.. ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం.. రాష్ట్ర స‌ర్కారు అనుమ‌తి తీసుకోవాలి. ఈ క్ర‌మంలో గ‌తంలో కేసీఆర్‌.. బీజేపీతో విభేదించిన నేప‌థ్యంలో త‌మ రాష్ట్రంలోకి సీబీఐ అధికారులు రావాలంటే.. ఉన్న నిబంధ‌న‌ను విధిస్తున్నామ‌ని.. స‌ర్కారు అనుమ‌తి లేకుండా సీబీఐ ద‌ర్యాప్తులు చేప‌ట్టడానికి వీల్లేద‌ని కేసీఆర్ తేల్చి చెప్పారు.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ రెండో విడ‌త‌లో సీబీఐ ఎంట్రీ ఇవ్వ‌కుండా ఆంక్ష‌లు విధించారు. దీనిపై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత పై మ‌ద్యం కుంభ‌కోణం కేసు విచార‌ణ సాగు తున్న నేప‌థ్యంలోనే కేసీఆర్ ఇలా చేశారంటూ.. అప్ప‌టి బీజేపీ చీఫ్‌గా ఉన్న ప్ర‌స్తుత కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ఆక్షేపించారు. క‌ట్ చేస్తే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 22 మాసాల త‌ర్వాత‌.. సీబీఐపై కేసీఆర్ విధించిన ఆంక్ష‌ల‌ను ఎత్తేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ఫైలుపై సంత‌కాలు చేశారు.

మ‌రోవైపు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ ద‌ర్యాప్తును చేప‌ట్ట డానికి వీల్లేద‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వెంట‌నే మ‌రో రూపంలో సీబీఐకి ఈ కేసును అప్ప‌గిస్తూ.. కేంద్రానికి లేఖ రాసింది. నేష‌న‌ల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన కాళేశ్వ‌రం నివేదిక ఆధారంగా.. సీబీఐ విచార‌ణ కోరుతున్నామ‌ని.. లేఖ‌లో పేర్కొంది. దీనిని అనుమ‌తించాల‌ని కేంద్ర హోం శాఖ‌ను అభ్య‌ర్థించింది.

అనుమ‌తిస్తారా?

ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంపై సీబీఐని వేయాలా? వ‌ద్దా? అనే విష‌యం కేంద్రం ప‌రిధిలోకి వెళ్లిపోయింది. వాస్త‌వానికి .. బండి సంజ‌య్ వంటివారు.. సీబీఐకి ఇవ్వాల‌ని కోరుకుంటున్నా.. కేంద్రం ఏమేర‌కు అనుమ‌తి ఇస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది . ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రేపు సీబీఐని విధిస్తే.. ఆయ‌న కూడా వి చార ణను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఏమేర‌కు స‌హ‌క‌రిస్తుంద‌న్న‌ది చూడాలి.