రేవంత్ కేబినెట్ కు కొత్త రూపు.. కసరత్తు షురూ
ఈ వాదనకు బలం చేకూరేలా పలు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే పలువురు ఆశావాహులు ఢిల్లీకి అదే పనిగా వెళ్లి వస్తున్నారు.
By: Garuda Media | 10 Jun 2026 12:53 PM ISTతెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు తీరి రెండున్నరేళ్లు దాటుతోంది. ఖాళీలను భర్తీ చేయటం.. పని తీరు ఆధారంగా కొందరు మంత్రులకు ప్రమోషన్.. మరికొందరికి డిమోషన్ ఖాయమని చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరే వేళలో.. అధినాయకత్వం చెప్పినట్లే కేబినెట్ రూపురేఖలు ఉంటే.. త్వరలో జరిగే ప్రక్షాళన మొత్తం రేవంత్ ఇష్టానికి అనుగుణంగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తుండటం గమనార్హం. గడిచిన రెండున్నరేళ్లలో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మార్కులు బాగా సంపాదించుకోవటమే కాదు.. పాలనలో ఆయనకు ఫ్రీహ్యాండ్ ఇవ్వాలన్న యోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగా గడిచిన రెండున్నరేళ్లలో మంత్రుల పనితీరు.. వారిపై వస్తున్న ఆరోపణలు.. విమర్శలకు తగ్గట్లు.. మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు హడావుడిగా అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విస్తరణ ఉంటుందన్న మాట వినిపించినా.. అది ఆచరణలోకి రాలేదు. ఇటీవల కాలంలో మారిన పరిణామాలు.. చోటు చేసుకుంటున్న పలు పరిస్థితులకు తగ్గట్లు కొత్త కేబినెట్ కసరత్తుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
ఈ వాదనకు బలం చేకూరేలా పలు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే పలువురు ఆశావాహులు ఢిల్లీకి అదే పనిగా వెళ్లి వస్తున్నారు. అధిష్ఠానం ఆశీస్సులు కోరుకుంటూ.. తమ మనసులోని మాటను వారికి చెప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలు ఢిల్లీ పెద్దల్ని కలవటం ఉదాహరణగా చెప్పొచ్చు.
కొత్త మంత్రివర్గం ఎలా ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు.. దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రి ఒకరికి మంత్రి పదవుల నుంచి తొలగించే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు మంత్రులకు శాఖల మార్పు షాక్ తప్పదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో వీరిపై వస్తున్న పలు ఆరోపణలతో ఈ నిర్ణయాన్ని తీసుకునే వీలుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చే రిపోర్టు కూడా పలువురు మంత్రులపై ప్రభావం చూపుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
కేబినెట్ 2.0లో ఇద్దరు లేదంటే ముగ్గురికి కొత్తగా కేబినెట్ లో చోటు దక్కుతుందని చెబుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా చూస్తే.. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయటంతో పాటు.. ఇద్దరు లేదంటే ముగ్గురికి ఉద్వాసన పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. కొత్త ముఖాల సంఖ్య ఐదు వరకు ఉండొచ్చన్నమాట వినిపిస్తోంది. నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఎన్నికల వేళ రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినప్పటికి అమలు సాధ్యం కాకపోవటంతో ఆయనకు అవకాశం ఇస్తారని.. అదే సమయంలో ఆయన బ్రదర్ కోమటిరెడ్డికి కేబినెట్ నుంచి తొలగించే వీలుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎస్టీ లంబడా కోటాలో బాలూనాయక్ కు కేబినెట్ లో చోటు ఆశిస్తున్నారు. ఒకవేళ బాలునాయక్ కు అవకాశం కల్పిస్తే నల్గొండ జిల్లా నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించినట్లు అవుతుంది. అదే జరిగితే.. బాలునాయక్ కోరిక తీరే అవకాశం తక్కువగా చెప్పొచ్చు. కేబినెట్లో బలమైన సామాజిక వర్గంగా చెప్పే మున్నురు కాపుకు చోటు లేకపోవటంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి అవకాశం దక్కే వీలుందంటున్నారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఈసారి మంత్రివర్గంలో తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే.. ఈ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గడ్డం ప్రసాద్ తో మిగిలిన వారి అవకాశాలు మూసుకుపోతాయి. పోటీకి చెక్ చెప్పాలంటే ఈ యాంగిల్ లో నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ముఖ్యమంత్రి రేవంత్ వద్ద ఉన్న కొన్ని కీలక శాఖలను కూడా బదిలీ చేసే వీలుందంటున్నారు. ముఖ్యమంత్రికి పని భారం తగ్గించి.. పాలన మీద మరింత ఫోకస్ చేసే ఆలోచనలో అధినాయకత్వం ఉందంటున్నారు. మొత్తంగా ఈ నెలాఖరులోపు మంత్రివర్గ పునర్విభజన ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
