Begin typing your search above and press return to search.

మేడారంలో మంత్రి వ‌ర్గ స‌మావేశం.. ఫ‌స్ట్ టైమ్‌!

మంత్రి వ‌ర్గ స‌మావేశం అంటే.. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా.. స‌చివాల‌యంలోనే జ‌రుగుతుంది. దీనికి కొన్ని విధివిధానాలు కూడా ఉంటాయి.

By:  Garuda Media   |   17 Jan 2026 9:30 AM IST
మేడారంలో మంత్రి వ‌ర్గ స‌మావేశం.. ఫ‌స్ట్ టైమ్‌!
X

మంత్రి వ‌ర్గ స‌మావేశం అంటే.. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా.. స‌చివాల‌యంలోనే జ‌రుగుతుంది. దీనికి కొన్ని విధివిధానాలు కూడా ఉంటాయి. అటెండెన్సు పుస్త‌కంలో సంత‌కాలు కూడా చేస్తారు. మినిట్స్ రూపొందిస్తారు. వాటిని రేపు ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సి కూడా ఉంటుంది. అయితే.. దీనికి భిన్నంగా తెలంగాణ ప్ర‌భుత్వం తొలిసారి స‌చివాల‌యం వెలుప‌ల మంత్రివ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం పెట్టుకుంది.

ఈ నెల 18న నిర్వ‌హించ‌నున్న మంత్రి వ‌ర్గ స‌మావేశానికి `మేడారం`ను ఎంపిక చేశారు. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ మేర‌కు ములుగు జిల్లా అధికారుల‌కు స‌మాచారం అందింది. దీంతో మేడారంలో మంత్రి వ‌ర్గ స‌మావేశానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నిర్వ‌హించ‌నున్న ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. ముఖ్యంగా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి ముంద‌స్తుగా జ‌రుగుతున్న మంత్రి వ‌ర్గ స‌మావేశం కావ‌డంతో దీనికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఈ నెల 20న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రానుంది. దీంతో ఆ త‌ర్వాత‌.. కోడ్ అమ‌ల్లో ఉండ నుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్ర‌భుత్వం ఆ మేర‌కు నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ఇక‌, మేడారంలో తొలిసారి స‌చివాల‌యానికి ఆవ‌ల నిర్వ‌హిస్తున్న మంత్రి వ‌ర్గ స‌మావేశానికి రెండు ప్ర‌ధాన రీజ‌న్లు క‌నిపిస్తున్నాయి. అందుకే.. తొలిసారి బ‌య‌ట నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు ముంద‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా భారీ భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు.

1) త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మేడారం జాత‌ర‌కు మ‌రింత ప్ర‌చారం క‌ల్పించ‌డం. 2) ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం.. మ‌రింత క్షేత్ర‌స్థాయికి దిగి వ‌చ్చింద‌న్న సంకేతాల‌ను ఇవ్వ‌డం. ఈ రెండు మిన‌హా ఇలా స‌చివాల‌యానికి ఆవ‌ల మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించేందుకు ప‌ర్టిక్యుల‌ర్‌గా రీజ‌న్లు ఏమీ క‌నిపించ‌డం లేదు. కాగా.. తెలంగాణ ఏర్ప‌డిన 11 సంవ‌త్స‌రాల్లో కేబినెట్ భేటీ ఇలా.. స‌చివాల‌యానికి ఆవ‌ల‌.. పైగా ఎస్టీలు ఎక్కువ‌గా ఉన్న మేడారంలో నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.