Begin typing your search above and press return to search.

తమ్ముడు కేబినెట్ లోకి...అన్న అవుటేనా ?

తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్గం విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది అన్న చర్చ చాలా రోజులుగా సాగుతోంది. ఇదే పని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలసి వచ్చారని కూడా ప్రచారం సాగింది.

By:  Satya P   |   20 Dec 2025 7:00 PM IST
తమ్ముడు కేబినెట్ లోకి...అన్న అవుటేనా ?
X

తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్గం విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది అన్న చర్చ చాలా రోజులుగా సాగుతోంది. ఇదే పని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలసి వచ్చారని కూడా ప్రచారం సాగింది. అయితే ఇంత ఆతృత ఎందుకు అంటే రెండేళ్ళ కాలం పూర్తి అయింది. రెండు బెర్తులు ఇంకా ఖాళీగా ఉండి ఊరిస్తున్నాయి. దాంతో వాటి మీదనే అందరి చూపూ ఉంది. సో రేవంత్ రెడ్డికి అయితే ఇపుడు కొంత ఫ్రీ హ్యాండ్ వచ్చింది అని అంటున్నారు. ఆయన సీఎం అయ్యాక కాంగ్రెస్ రెండు ఉప ఎన్నికల్లో గెలిచింది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తిరుగులేని హవా చూపించింది. దాంతో తన మార్క్ మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోవాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు.

అవుట్ అయ్యేవారు అలా :

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి చాలా మంది మంత్రుల విషయంలో వారి పని తీరు విషయంలో నిశిత పరిశీలన చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈసారి రెండు ఖాళీలే కాదు మరో నాలుగైదు ఖాళీలను చేయించి అయినా ఆరేడు మందికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే ఒక మహిళా మంత్రితో సహా కొందరి మంత్రి పదవికి ఎసరు వస్తుందని అంటున్నారు. అలా వారిని పక్కకు పెట్టి తనకు నచ్చిన వారికి ఎన్నికల వేళ పార్టీకి బాగా ఉపయోగపడేవారిని సామాజిక సమీకరణలను సైతం చూసుకుంటూ మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. దాంతో కనీసంగా అయిదారుగురు అవుట్ అనే తెలుస్తోంది.

ఒక్కరే కోమటిరెడ్డి :

ఏ లెక్క ఎలా ఉన్నా మంత్రివర్గంలో ఒక్కరే కోమటి రెడ్డి ఉంటారని అంటున్నారు. అంటే ప్రస్తుతం కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. కానీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలని అంటున్నారు. ఆయనకు నేరుగా కాంగ్రెస్ అధిష్టాననం నుంచే ఒక భారీ హామీ ఉందని చెబుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందే అన్నది కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సూచించారని చెబుతున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదగ్వి ఇస్తే నల్గొండ జిల్లాలో ప్రాంతీయ సామాజిక సమీకరణలను కూడా చూసుకోవాలని సూచించారు అని అంటున్నారు. అలా జరిగితే కనుక మంత్రివర్గంలోకి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వస్తారు, అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుట్ అవుతారా అన్నదే చర్చగా ఉంది.

తప్పిస్తే ఊరుకుంటారా :

అయితే ఆయనకు ఆల్టర్నేషన్ పదవిని ఏదో చూపించాలని కూడా హైకమాండ్ సూచించింది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే తనకు మంత్రి పదవి ఖాయమని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు కానీ అదే సమయంలో ఆయన అన్న పదవికే ఎసరు రావచ్చు అని చర్చ కూడా సాగుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు లేరా అని వాదించవచ్చు కానీ అవేమీ రాజకీయంగా చూసే తూకాలలో సరిపోవు, దాంతో ఒకే ఇంట్లో ఒకరికి మంత్రి పదవి అంటే వేరొకరు తప్పుకోవాల్సిందే అని వినిపిస్తోంది. మరి అయిదేళ్ళ మంత్రిగా తనను తాను భావించుకోవడమే కాదు సీఎం రేసులో కూడా ఉన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిస్తే ఊరుకుంటారా అన్నదే ఇపుడు బిగ్ డిస్కషన్ గా ఉందిట.