Begin typing your search above and press return to search.

రేవంత్ మంత్రివర్గ విస్తరణకు కౌంట్ డౌన్ ?

దాంతో ఈ ఖాళీలలో ఎవరిని తీసుకుంటారు అన్న చర్చ మొదలైంది. కొండా సురేఖ ప్లేస్ లో బీసీకి చెందిన మహిళకే చాన్స్ అని అంటున్నారు.

By:  Satya P   |   4 Sept 2026 7:53 AM IST
రేవంత్ మంత్రివర్గ విస్తరణకు  కౌంట్ డౌన్  ?
X

తెలంగాణాలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉన్న మంత్రులలో పనిచేయని వారిని తప్పించి కొత్త వారికి సామాజిక రాజకీయ ప్రాంతీయ సమీకరణలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు. ఒక మంత్రిని అందునా బీసీ మహిళను తీసేశారు అన్నది జనంలోకి వెళ్లి దాని వల్ల వేరే పర్యవసానాలు తలెత్తకుండా ఈ వేడిలోనే ఆ పని కూడా కానిచ్చేస్తే మరో రెండేళ్లలో వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కొంటుంది అన్న భావన కూడా కాంగ్రెస్ పెద్దలలో ఉంది అని అంటున్నారు. ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి ఈ విషయంలో హైకమాండ్ వద్ద మంత్రి వర్గ విస్తరణకు కూడా ఆమోదం పొందారని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి.

గవర్నర్ తో భేటీతో :

ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే నేరుగా లోక్ భవన్ వెళ్ళి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కూడా వెంట ఉండడం విశేషం. దాంతో పెద్ద ఎత్తున రాజకీయ ఊహాగానాలు చెలరేగాయి. మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం అవుతోందా అన్న చర్చ వేడిగా వాడిగా సాగింది. అయితే ముఖ్యమంత్రి గవర్నర్ తో ఏమి మాట్లాడారు అన్నది ఎవరికీ తెలియదు కానీ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే జరుగుతున్న పరిణామాలను కూడా ఎంతో కొంత ఊహించే రాజకీయ విశ్లేషకులు మాత్రం కచ్చితంగా విస్తరణ కోసమే అని ఢంకా భజాయిస్తున్నారు. అయితే రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన గవర్నర్ తో చర్చించారు అని అంటున్నారు. ఆమె బర్తరఫ్‌కు దారితీసిన పరిస్థితులను రేవంత్ రెడ్డి గవర్నర్‌కు వివరించారని కూడా చెబుతున్నారు.

మూడు మంత్రి పదవులు ఖాళీ :

ఇదిలా ఉంటే మంత్రి వర్గ విస్తరణకు వారూ వీరూ అన్నారని కాదు కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్న మాట వినిపిస్తోంది. ఇదే పని రెండు మూడు నెలల క్రితం చేసి ఉంటే కొండా సురేఖను ఆనాడే గౌరవంగా తప్పించేసేవారు. ఇపుడు బర్తరఫ్ దాకా వ్యవహారం తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని అంటున్నారు. దాంతో ఇదే జోరులో మంత్రి వర్గ విస్తరణ చేపట్టినట్లు అయితే మరింత సమర్ధంగా కేబినెట్ పనిచేస్తూ జనంలోకి వెళ్లే చాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా కొండా సురేఖని బర్తరఫ్ చేయడంతో మంత్రి వర్గంలో మూడు ఖాళీలు ఏర్పడినట్లుగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని పక్కకు తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. అలా చూసుకుంటే కనీసం అరడజన్ కి తగ్గకుండా ఖాళీలు ఏర్పడతాయని అంటున్నారు.

మహిళా మంత్రులకు చాన్స్ :

దాంతో ఈ ఖాళీలలో ఎవరిని తీసుకుంటారు అన్న చర్చ మొదలైంది. కొండా సురేఖ ప్లేస్ లో బీసీకి చెందిన మహిళకే చాన్స్ అని అంటున్నారు. అలాగే ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇంకా అనేక మంది ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి మదిలో ఏముందో తెలియాల్సి ఉంది అని కూడా మాట వినిపిస్తోంది. కొండా సురేఖని పక్కన పెట్టడంతో మహిళా మంత్రులు ఒక్కరే అయ్యారు. దాంతో మరో ఇద్దరికి అయినా చాన్స్ ఇస్తారని అంటున్నారు. అలాగే బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని డిమాండ్ కూడా ఉన్న నేపథ్యంలో వారి నుంచి కూడా ఆశలు ఎక్కువ అవుతున్నాయి.

డేట్ అదేనా మరి :

అయితే రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ వేసిన తరువాత సాధ్యమైనంత తొందరగా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అంటున్నారు. అయితే ఈ నెల 7 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దాని కంటే ముందే విస్తరణ ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. అదే అయితే ఈ నెల 6న మంచి ముహూర్తం ఉందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సుముఖంగా ఉందని వార్తలు వస్తున్న క్రమంలో విస్తరణకు ఎలాంటి ఆటంకలు ఉండవని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.