Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల షాక్.. ఘర్ వాపసీ మంత్రంతో పొలిటికల్ హీట్!

అయితే ఇలా చేరిన వారిలో కొందరు ఇప్పుడు రివర్స్ గేర్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ పరిశీలకుల్లో చర్చ నడుస్తోంది.

By:  Tupaki Political Desk   |   16 Sept 2026 4:00 AM IST
రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల షాక్.. ఘర్ వాపసీ మంత్రంతో పొలిటికల్ హీట్!
X

తెలంగాణలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి ఘర్ వాపసీ అంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారని జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం నడుమ జంపింగ్ ఎమ్మెల్యేలు సైతం హస్తానికి హ్యాండ్ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయని అంటున్నారు. తెలంగాణలో మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి విపక్ష హోదా లేకుండా చేయాలనే ఎత్తుగడతో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇలా చేరిన వారిలో కొందరు ఇప్పుడు రివర్స్ గేర్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ పరిశీలకుల్లో చర్చ నడుస్తోంది.

బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది స్థానికంగా సొంత నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి వారిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. ఆయనను నియోజకవర్గ నేతలు కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన ఎక్కువగా ఉందని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరి తప్పుచేశానంటూ ఆయన గతంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ లో తిరిగి చేరేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే కోవలో బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడినందుకు మదన పడుతున్నారని పరిశీలకులలో చర్చ జరుగుతోంది.

ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంటివారు సైతం రకరకాల కారణాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన పది మందిలో సీనియర్ నేత కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వంటి వారు మాత్రమే కాస్త సంతృప్తితో కనిపిస్తున్నారని అంటున్నారు. మిగిలిన వారిలో ఒకరిద్దరు మళ్లీ రివర్స్ గేర్ వేసేలా బీఆర్ఎస్ పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారని చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు తరముకొస్తుండటం, రాష్ట్రంలో రాజకీయంగా తమ పరిస్థితి నానాటికి దిగజారుతుందన్న ఆందోళనతో ఎమ్మెల్యేలు ఘర్ వాపసీకి సిద్ధమవుతున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని వచ్చిన తమకు నియోజకవర్గాల్లో సరైన గౌరవం ఇవ్వడం లేదని, సీనియర్లు, అసలైన కాంగ్రెస్ వాదులు అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. ఇదే సమయంలో అనర్హత వేటువేయించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యేలను కలవరపెడుతున్నాయని అంటున్నారు. పార్టీ మారిన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, కొత్తగా వచ్చిన సమస్యలతో సతమతమవుతున్న ఎమ్మెల్యేలు రివర్స్ గేర్ వేసేందుకు రెడీ అవుతున్నారని, అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూస్తున్నారని జరుగుతున్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెబుతున్నారు.