Begin typing your search above and press return to search.

జనసేన - బీజేపీ అక్కడ క్లియర్ కట్ గానే !

తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటోంది. 2023 ఎన్నికల్లోనే తామే పవర్ లోకి వస్తామని చాలా హడావుడి చేసింది.

By:  Satya P   |   12 Jan 2026 5:00 AM IST
జనసేన - బీజేపీ అక్కడ క్లియర్ కట్ గానే !
X

తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటోంది. 2023 ఎన్నికల్లోనే తామే పవర్ లోకి వస్తామని చాలా హడావుడి చేసింది. అయితే పాతిక సీట్లు పైగా వస్తే చాలు కధ నడిపించవచ్చు అన్నది కూడా ప్లాన్ బీ లో ఉందని చెబుతారు. మొత్తానికి చూస్తే ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు మాత్రమే బీజేపీకి దక్కాయి. ఇక ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎనిమిది సీట్లు దక్కాయి. మరి ఈ లెక్క చూసుకుని బీజేపీ తాము అధికారంలోకి సొంతంగా రావచ్చు అన్న ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. ఎనిమిది ఎంపీలు అంటే ఒక్క ఎంపీ సీటుకూ ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఇలా చూసుకుంటే 56 అసెంబ్లీ సీట్ల పరిధిలో తమకు బలం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది అని అంటున్నారు.

ఒంటరిగానే పోటీ :

ఇదిలా ఉంటే ఈ మధ్యనే జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఓట్లు అనుకున్నంతగా రాలేదు, అయితే అక్కడ టీడీపీకి జనసేనకు బలం ఉంది. ఆ రెండు పార్టీల మద్దతు తీసుకుని ఉంటే బీజేపీ బలం పెరిగేది అన్న చర్చ కూడా జరిగింది. కానీ బీజేపీ మాత్రం అలా చేయలేదు, తెలుగుదేశంతో పొత్తు అంటే 2018లో కాంగ్రెస్ కి అయిన అనుభవమే తమకు అవుతుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆంధ్రా పార్టీగానే టీడీపీని చూస్తూ బీఆర్ఎస్ వంటివి కామెంట్స్ చేస్తాయని దాని వల్ల తమకు ఇబ్బంది అవుతుందని కూడా బీజేపీ ఆలోచన అని అంటున్నారు. మరి జనసేన విషయంలో బీజేపీకి ఉన్న అభ్యంతరాలు ఏమిటి అన్నది మరో చర్చ. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. కానీ తీరా చూస్తే బీజేపీ ఎనిమిది సీట్లు మాత్రమే దక్కించుకుంది. జనసేనకు పెద్దగా ఓట్లు రాలేదని విశ్లేషణలు ఉన్నాయి. ఆ మీదట 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో సోలోగా పోటీ చేస్తే బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు రావడంతో కూడా ధీమా పెరిగింది అని అంటున్నారు.

పొత్తు అవసరం లేదని :

ఇదిలా ఉంటే బీజేపీతో జనసేన పొత్తు ఏపీకే పరిమితం అని తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. అది కూడా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తు పెట్టుకున్నారు అని చెబుతున్నారు. అక్కడ రాజకీయ పరిణామాల కారణంగానే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని చెప్పుకొచ్చారు అదే తెలంగాణాలో చూస్తే జనసేన పార్టీతో తమకు ఎలాంటి పొత్తు అవసరం లేదని ఆయన తేల్చేశారు.

ఒంటరి రూటులోనే :

అంతే కాదు తొందరలో జరగబోయే తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల తామే తెలంగాణాలో ఒక బలమైన కీలక శక్తిగా నిలబడతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. జనసేనతో తమకు అవసరం అన్నది లేదని ఈ విషయమే జాతీయ నాయకత్వానికి కూడా చెబుతామని రామచంద్రరావు చెప్పడం విశేషం.

జనసేన రెడీ అంటూ :

ఇదిలా ఉంటే జనసేన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీకి రెడీ అని ప్రకటించిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే బీజేపీ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం పట్ల చర్చ అయితే సాగుతోంది. జనసేన వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీకి సిద్ధమని పేర్కొంది. తాము సంస్థాగతంగా బలోపేతం అవుతామని కూడా ప్రకటించుకుంది. పవన్ కళ్యాణ్ భావజాలం అలాగే ఆయన ఆశయాలను జనం ముందు ఉంచుతామని చెబుతోంది. అయితే బీజేపీ మాత్రం జనసేనతో పొత్తు కొట్టిపారేయడం అంటే రాజకీయంగా ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు. బీజేపీకి అయితే పట్టణ ప్రాంతాలలో ఓటు బ్యాంక్ ఉంది, బలం ఉంది, జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏ మేరకు ఓట్లు సీట్లూ రాబడుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జనసేన టీడీపీ పొత్తుని ఏపీకే పరిమితం చేస్తూ తెలంగాణా బీజేపీ చేస్తున్న ప్రకటన మాత్రం డిస్కషన్ గానే ఉంది. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఒక రాష్ట్రంలో ఒక విధంగా ముందుకు వెళ్తోందా అన్నది కూడా ప్రశ్నలుగా ముందుకు వస్తున్నాయి.