Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డిపై బీజేపీ 'బెంగాల్ సెంటిమెంట్ ' .. ..!

తెలంగాణ బీజేపీ నేత‌ల‌ను ఢిల్లీ పెద్దలు పార్టీ నేతలను గట్టిగానే హెచ్చరించినా అసలు సమస్య అంతర్గత విభేదాలే.

By:  Garuda Media   |   21 July 2026 7:00 PM IST
రేవంత్ రెడ్డిపై బీజేపీ బెంగాల్ సెంటిమెంట్  .. ..!
X

తెలంగాణలో ఎలాగైనా జెండా పాతాలని పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్టానం ఒక భారీ వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. గ‌తంలో ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ( టీఎంసీ) రౌండ్ ది క్లాక్ పోరాటాన్ని ఎదుర్కొనేందుకు ఏ త‌ర‌హా దూకుడు వ్యూహం అమ‌లు చేసిందో సరిగ్గా అదే ‘బెంగాల్ మోడల్’ ను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్న‌ట్టుగా తెలంగాణ బీజేపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం న‌డుస్తోంది. క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు.

రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను, హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేకతను డిజిటల్ వేదికల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఢిల్లీ స్థాయి నుంచే వ్యూహాలు అమ‌లు అవుతున్నాయి. సోష‌ల్ మీడియాను గ‌ట్టిగా వాడుకుని ప్ర‌భుత్వ వైప‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నున్నారు. ప్రాంతీమ‌, కుల స‌మీక‌ర‌ణ‌లు, బ‌ల‌మైన పోల్ మేనేజ్‌మెంట్‌పై కూడా బ‌లంగా దృష్టి సారించ‌నుంది.

తెలంగాణ బీజేపీ నేత‌ల‌ను ఢిల్లీ పెద్దలు పార్టీ నేతలను గట్టిగానే హెచ్చరించినా అసలు సమస్య అంతర్గత విభేదాలే. పశ్చిమ బెంగాల్ తరహా పోరాట పటిమ చూపించాలంటే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తమ వ్యక్తిగత అహాలను, గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టాల్సి ఉంటుంది. పైకి అంతా ఐక్యంగా ఉన్నామని నటిస్తూ, లోపల ఒకరి సీటుకు ఒకరు ఎసరు పెట్టుకునే రాజకీయాలకే నేతలు ప‌రిమిత‌మ‌వుతున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో మార్పులు రాక‌పోతే ఢిల్లీ నుంచి ఎంత మానిట‌రింగ్ జ‌రిగినా కూడా తెలంగాణ‌లో బీజేపీ బెంగాల్ టార్గెట్ చేరుకోవడం దాదాపు అసాధ్యం. తెలంగాణలో దూకుడుగా వెళ్తున్న రేవంత్ రెడ్డి మార్క్ కాంగ్రెస్‌ను ఢీకొట్టాలంటే కమలనాథులు కేవలం కాగితాలపై వ్యూహాలు రచించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఎంతవరకు కలిసికట్టుగా పోరాడుతారనే దానిపైనే బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.