తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది ?
గతంలో బీజేపీ నేతలు, ప్రస్తుత బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు తీవ్ర విమర్శలతో ప్రభుత్వం మీద విరుచుకుపడేవారు.
By: Tupaki Political Desk | 20 Aug 2026 12:18 PM ISTతెలంగాణలో 2023 ఎన్నికల్లో ఎనిమిది శాసనసభ స్థానాలను గెలుచుకుని, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది లోక్ సభ స్తానాలను గెలుచుకుని సత్తాచాటిన భారతీయ జనతా పార్టీ ఇటీవలి కాలంలో చతికిల పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగు ఎంపీ స్థానాల నుండి గత లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది లోక్ సభ స్థానాలు అంటే 56 శాసనసభ స్థానాలలో ప్రభావం చూపించి గెలిచిన పార్టీ ఆ తర్వాత ఆ స్థాయిలో పుంజుకోక పోవడానికి కారణం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గతంలో బీజేపీ నేతలు, ప్రస్తుత బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు తీవ్ర విమర్శలతో ప్రభుత్వం మీద విరుచుకుపడేవారు. కానీ ఇటీవల కాలంలో వారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అంతర్గత కలహాలతో పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఇక పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. బండి సంజయ్ కుమారుడి మీద ఆరోపణలతో పాటు రఘునందన్ రావు అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కూడా చర్చానీయాంశం అయింది.
ఇది ఇలా ఉంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులతో అపాయింట్ మెంట్ ఇప్పించాలని, మహారాష్ట్ర సీఎంతో అపాయింట్ మెంట్ ఇప్పించి, ఆ ప్రభుత్వాన్ని తుమ్మిడిహెట్టి వద్ద 152 అడుగుల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పించాలని రేవంత్ రెడ్డి పలుమార్లు డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఆయన డిమాండ్లను సరైన రీతిలో తిప్పికొట్టకపోగా, దగ్గరుండి కేంద్ర మంత్రులను కల్పించి, హైదరాబాద్ మెట్రోకు నిధులు సమకూర్చే విషయమై మంతనాలు జరిపారు.
కానీ ఇప్పటి వరకు నిధులు రాకపోగా, రోజుకు రెండు కోట్లు అదనంగా తెలంగాణ ఖజానా మీద భారం పడుతున్నది. మెట్రో రైలు స్వాధీనం విషయంలో రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టకుండా వదిలేయడం మూలంగానే మెట్రో విషయంలో తను చేసిన తప్పును కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టే ప్రయత్నం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలు ఇలా ఉంటే ఉత్తర తెలంగాణలోని ఒక ఎంపీ బీజేపీ నుండి కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ పనితీరు మీద అసహనంతో ఉన్న ఆ ఎంపీ ఇటీవల ఒక ఏఐసీసీ నేతతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. రెండో సారి ఎంపీ అయినప్పటి నుండి కేంద్ర మంత్రి పదవి మీద కన్నేసిన సదరు ఎంపీ అది దక్కక పోవడంతో కనీసం రాష్ట్ర అధ్యక్ష్య పదవి అయినా వస్తుందని ఆశించారు.
కానీ ఆ రెండూ దక్కక పోవడంతో కాంగ్రెస్ వైపు కన్నేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏఐసీసీ నేతకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, వాటి పర్యావసనాలు, మంత్రులు, ఎమ్మెల్యేల తీరు మీద నివేదికలు పంపుతున్నట్లు సమాచారం. ప్రతి సారీ ఈ సారి బీజేపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని భావిస్తుంటే, ఏదో ఒక కారణంతో పార్టీ గ్రాఫ్ పడిపోతుందని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. త్వరలోనే తెలంగాణలో అధికారం లక్ష్యంగా బీజేపీ అధిష్టానం చర్యలు చేపట్టబోతుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిక్కుముళ్లను దాటుకుని ఎలా ముందుకు సాగుతారో వేచిచూడాలి.
