తెలంగాణ బీజేపీలో గొడవలకు ఫుల్ స్టాప్ లేనట్టేనా.. ?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడితో పాటు, బండి సంజయ్‌తోనూ తీవ్ర విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.
By: Garuda Media | 21 July 2026 8:00 PM ISTతెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఢిల్లీ పెద్దలు ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా, నేతల మధ్య ఆధిపత్య పోరాటానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అధిష్టానం ఎన్ని పంచాయతీలు పెట్టినా పార్టీలోని అంతర్గత రగడ సమసిపోయేలా కనిపించడం లేదు. ప్రధానంగా కరీంనగర్ కేంద్రంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సాగుతున్న కోల్డ్ వార్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. కష్టపడి పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన తమ నాయకుడిని కాదని, ఇతర పార్టీ నుంచి వచ్చిన ఈటలకు పదవులు ఇస్తున్నారనే అసంతృప్తితో బండి వర్గం నేతలు ఉన్నారు.
తాము సీనియర్లమని, రాష్ట్రవ్యాప్తంగా మాస్ ఇమేజ్, బలమైన క్యాడర్ తమకు ఉందనే భావనతో ఈటెల వర్గం నేతలు ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన 'రైట్ లాయలిస్ట్'గా సంజయ్, రాజకీయ అవసరాల రీత్యా చేరిన నేతగా ఈటల మధ్య ఈ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ విభేదాలు కేవలం వీరిద్దరికే పరిమితం కాలేదు. రాష్ట్ర కమిటీలోని దాదాపు ప్రతి అగ్రనేతకూ ఒక సొంత గ్రూపు ఉందనేది బహిరంగ రహస్యం.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడితో పాటు, బండి సంజయ్‌తోనూ తీవ్ర విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది లేదని అర్వింద్ రెండు, మూడుసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదుద. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కి, రాష్ట్రంలోని ఇతర సీనియర్ నాయకులకు మధ్య సరైన సమన్వయం లోపించింది.
పార్టీ పాత కాపులకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు మధ్య ఉన్న ఈ పొసగని తత్వంతో క్షేత్రస్థాయి క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. మీడియా ముందు గొడవలు వద్దని, నేతలు సొంత ఎజెండాలు పక్కనబెట్టి పార్టీ లైన్ ప్రకారమే నడుచుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎన్నోసార్లు తెలంగాణ బీజేపీ నేతలకు గట్టిగానే క్లాస్ పీకుతూ వస్తోంది. భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా అందరినీ కలుపుకుని పోవాలని ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నా గ్రూపు రాజకీయాలు ముదిరిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ అంతర్గత గొడవలకు తక్షణమే ఫుల్ స్టాప్ పడుతుందా అంటే "లేదనే" సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.
