బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హౌస్ అరెస్టు.. రీజనేంటి?
ఇటీవల బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ఓ వ్యక్తి చొరబడి ఆలయంలో ధ్వంసానికి పాల్పడ్డాడు.
By: Garuda Media | 12 Aug 2025 4:34 PM ISTతెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వాస్తవానికి ఆయన ఎలాంటి ఆందోళనలకు పిలుపు ఇవ్వలేదు. ఎలాంటి నిరసనలు చేపడతామని కూడా చెప్పలేదు. కానీ, పోలీసు లు ఆయనను మంగళవారం ఉదయం 6 గంటలకే ఇంటి నుంచి బయటకు కదలరాదంటూ.. హౌస్ అరెస్టు చేశారు. ఈ పరిణామం రాష్ట్రంలో బీజేపీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే రియాక్ట్ అయినా.. పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పోలీసులపై విమర్శలు గుప్పించారు.
ఏం జరిగింది?
ఇటీవల బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ఓ వ్యక్తి చొరబడి ఆలయంలో ధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అప్పట్లోనే బీజేపీ నాయకులు ఖండించారు. రాష్ట్రంలో హిందూ సంస్థలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ క్రమంలో మంగళవారం పెద్దమ్మగుడిని దర్శించేందుకు.. అమ్మవారికి పూజలు చేసేందుకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. వీటిపై స్పందించి.. రాం చందర్‌రావు కూడా.. కుంకుమార్చనకు వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామునే.. ఆయన నివాసానికి వెళ్లి హౌస్ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటిం చారు. మరోవైపు.. జీహెచ్ ఎంసీ పరిధిలో పలువురు కార్పొరేటర్లను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా.. ఈ అరెస్టుల తీరుపై హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసలు తాము ఎలాంటి నిరసన, ధర్నాకు పిలుపు ఇవ్వకుండానే రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్‌ను ప్రకటించడం ఏంటని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి నిలదీశారు.
రేవంత్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి ప్రజలను రక్షించడం, శాంతి భద్రతలను కాపాడడం చేతరావడం లేదని వ్యాఖ్యానించారు. అసలు ఎలాంటి నిరస న వ్యక్తం చేయకుండానే గృహ నిర్బంధం చేయడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం ప్రజా నిరసనలకు, ఉద్యమాలకు వణికి పోతోందని మంత్రి ఎద్దేవా చేశారు.
