బీజేపీ బీసీ సీఎం...ఈటెల చాన్స్ కొట్టేస్తారా ?
తెలంగాణా రాజకీయాల్లో బీసీ సీఎం నినాదం అన్నది కొత్తగా ఉండడమే కాదు అత్యధిక శాతం ఉన్న ఆ వర్గాలను ఆకర్షిస్తుందని కమలం పార్టీ బలంగా విశ్వసిస్తోంది.
By: Satya P | 20 Sept 2026 9:12 AM ISTతెలంగాణా రాజకీయాల్లో బీజేపీ దూసుకుని పోవాలని అనుకుంటోంది. అయితే ఎక్కడా అవకాశం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇవ్వడం లేదు, రెండు పార్టీలు గ్రౌండ్ లెవెల్ నుంచి గట్టిగా పాతుకుపోయిన పార్టీలు కావడంతో బీజేపీకి ఎక్కడా పొలిటికల్ స్పేస్ అయితే దొరకడం లేదు. పైగా బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉంటూ పటిష్ట పరచుకుంది. కాంగ్రెస్ కి మొదటి నుంచి క్యాడర్ బేస్ గట్టిగానే ఉంది. దీంతో బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి రావాలీ అంటే సామాజిక సమీకరణలనే నమ్ముకోవాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ వచ్చే ఎన్నికల కోసం బీసీ నినాదం ఎంచుకుంది అని అంటున్నారు.
బీసీ సీఎం అంటూ :
తెలంగాణా రాజకీయాల్లో బీసీ సీఎం నినాదం అన్నది కొత్తగా ఉండడమే కాదు అత్యధిక శాతం ఉన్న ఆ వర్గాలను ఆకర్షిస్తుందని కమలం పార్టీ బలంగా విశ్వసిస్తోంది. నిజానికి చూస్తే ఒక్క తెలంగాణా అనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పటిదాకా బీసీ సీఎం అయిన వారు లేరు, ఉమ్మడి ఏపీలో ఎస్సీలకు సీఎం చాన్స్ దక్కింది కానీ బీసీల ఊసే లేదు. దాంతో ఇపుడు ఈ కొత్త నినాదానికి బీజేపీ పదును పెడుతోంది. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా బీసీలనే సీఎం గా చేస్తామని ఆ పార్టీ అంటోంది. కాంగ్రెస్ కి ఓటేసినా బీఆర్ఎస్ లని నెగ్గించినా బీసీలు సీఎం అయ్యే చాన్సే లేదు అని కూడా బీజేపీ అంటోంది. ఈ విధంగా ప్రధాన పార్టీలలో ఉన్న లోటుని బయటపెట్టి తాను అక్కడ పై చేయి సాధించాలని చూస్తోంది అని అంటున్నారు.
ఎవరికి కిరీటం :
బీజేపీ బీసీ సీఎం నినాదం వరకూ బాగానే ఉంది కానీ ఎవరినో ఒకరిని సీఎం అభ్యర్థిగా ముందు పెడితేనే కదా వర్కౌట్ అవుతుంది అన్నది కూడా ఉంది. దానితో బీజేపీలో బీసీ బడా నేతలు ఎవరు అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. బీసీ నేతగా దశాబ్దం పాటు మంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఈటెల రాజేందర్ ఉన్నారని ఆయన వర్గం అంటోంది. ఇక ఈ విషయం మీద ఈటెల అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు సీఎం పదవి దక్కాల్సిందే అని ఆయన అంటున్నారు. బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు. ప్రజలలో కూడా రాజకీయ చైతన్యం పెరిగింది అని అందువల్ల రానున్న కాలంలో తెలంగాణాకు బీసీ సీఎం తప్పకుండా వస్తారు అని అంటున్నారు.
బండి సంజయ్ కూడా :
అయితే బీజేపీలో మొదటి నుంచి పనిచేస్తూ వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బీసీ నేతగా ఉన్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో పార్టీ ఎన్నో విజయాలను సాధించింది. దాంతో బీజేపీ బీసీ సీఎం నినాదం కనుక తీసుకుని ముందుకు సాగితే కచ్చితంగా బండి వర్సెస్ ఈటెల అన్నది వస్తుందని అంటున్నారు. ఈ ఇద్దరికీ చాన్స్ స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈటెల బీజేపీలో మొదటి నుంచి లేరు కదా అన్న డౌటే అవసరం లేదని పశ్చిమ బెంగాల్ లో సువేందు అధికారి కూడా ఒక ఎన్నిక ముందే పార్టీలో చేరి సీఎం అయ్యారు అని గుర్తు చేస్తున్నారు. దాంతో బీజేపీ బీసీ సీఎం గా ఈటెలకు చాన్సెస్ ఎక్కువ అని అంటున్నారు ఆయన అనుచరులు. ఈటెల ఈ విషయం మీద గట్టిగా మాట్లాడడంతో ఆయన ఫోర్ ఫ్రంట్ లో ఉన్నారని అర్థం అవుతోంది. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం బీజేపీకి ఓట్లు రాలుస్తుందా లేదా అన్నది.
