బీర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. గ్లాసులోకి వచ్చే బీర్ రుచి మారనుందా?
ఇన్నాళ్లూ మంజీరా తీపి నీళ్లతో తయారైన బీరు తాగి.. లైఫ్‌ను జాలీగా ఎంజాయ్ చేసిన మందుప్రియులకు ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలైంది.
By: A.N.Kumar | 27 Oct 2026 11:12 AM ISTవేసవి తీవ్రత.. ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు.. ఇలా ఏ కొంప మునిగినా ముందుగా బలియ్యేది సామాన్యుడో, రైతో అనుకుంటే పొరపాటే.. ఈసారి ఏకంగా 'బీర్ ప్రియుల' గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాతావరణ మార్పులంటే ఇప్పటివరకు ఉక్కపోత, కరెంట్ కోతలు అనుకున్నాం. కానీ ఇప్పుడు బార్లలో పడే ‘సిప్’ మీద కూడా పర్యావరణ దెబ్బ పడేలా ఉంది.
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చెమటలు పట్టేంత కాకపోయినా.. గొంతు తడవడానికి చల్లటి బీరు బాటిల్ పడితే ఆ కిక్కే వేరు.. అయితే ఈసారి బీరు ప్రియుల గుండెల్లో గుబులు రేపే ఒక "షాకింగ్" వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎల్ నినో ఎఫెక్టో.. వర్షాలు పడకపోవడమో కానీ.. సంగారెడ్డి ప్రాంతంలోని బ్రూవరీలకు నీటి సెగ తగిలిందట. మంజీరా నీళ్లు రాక.. భూగర్భ జలాలు వాడాల్సి వస్తే... అబ్బో మన ఫేవరెట్ బీరు రుచి మారిపోతుందేమోనని మందుబాబులు ఆందోళనలో పడిపోయారు..
మంజీరా 'కిక్కు' పోయి.. బోరు నీళ్ల 'స్ట్రోక్' వస్తుందా?
ఇన్నాళ్లూ మంజీరా తీపి నీళ్లతో తయారైన బీరు తాగి.. లైఫ్‌ను జాలీగా ఎంజాయ్ చేసిన మందుప్రియులకు ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలైంది. "ఏంటి భయ్యా.. మంజీరా నీళ్లు బంద్ చేసి బోరు నీళ్లు వాడతారా? అంటే మేము తాగే బీరులో కాల్షియం, మెగ్నీషియం శాతాలు మారిపోతాయా? మాల్ట్, హాప్స్ రుచులు తేడా కొడతాయా?" అని సైంటిస్టుల కన్నా ఎక్కువగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు మందుబాబులు...
కానీ ఒక్క నిమిషం ఆగండి.. బ్రూవరీ కంపెనీలు ఊరి చివర చెరువు నీటిని నేరుగా సీసాలో పోసి ఇచ్చేంత అమాయకంగా ఏమీ లేవు. అక్కడ అడ్వాన్స్డ్ ఆర్వో ప్లాంట్లు, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. బోరు నీళ్లయినా.. మోరీ నీళ్లయినా.. తమ పాత రుచి వచ్చేలా నీటిని కడిగి, తుడిచి, కెమికల్ బాలెన్స్ చేసి మరీ వాడతారు. కాబట్టి టేస్ట్ మారిపోతుందని ఇప్పటికైతే భయపడాల్సిన పనిలేదు.
తెలంగాణలోని సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ బ్రూవరీ కంపెనీలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ హాయిగా మంజీరా నీటితో గొంతు తడుపుకుంటూ బీర్లు తయారు చేసిన కంపెనీలకు, అధికారులు తాగునీటి కొరత నెపంతో నీటి సరఫరా నిలిపివేశారట. దాంతో ఇప్పుడు పరిశ్రమలు "నీళ్లు లేకపోతే బీర్ ఎలా వంచాలి నాయనా?" అని ప్రత్యామ్నాయాల కోసం భూగర్భ జలాల వైపు చూస్తున్నాయి.
నాణ్యతా? లేక 'నయానా భయానా' టేస్టా?
ఒక నీటి వనరు మారిపోతే బీర్ రుచి, వాసన మారడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. బీర్ తయారీలో నీరే ప్రధాన ముడిపదార్థం. అందులోని కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్ల మోతాదు మారితే ఇచ్చే కిక్కు కూడా రూటు మారుస్తుంది. మన బ్రూవరీల వర్షన్ చూస్తే.. "అబ్బే.. మా దగ్గర పెద్ద పెద్ద ఫిల్టర్లు, ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి సార్.. నీటిని ఎంతకైనా శుద్ధి చేసి పాత రుచినే అందిస్తాం’’ అని ఘంఠాపథంగా మందుబాబులకు భరోసానిస్తున్నాయి.
మందు ప్రియుల భయం మాత్రం తగ్గడం లేదయ్యా.. "ఏమోనయ్యా.. మీరు నీళ్లను బాగానే శుద్ధి చేస్తారేమో కానీ ఆ బోరు నీళ్ల గట్టితనం వల్ల బీర్ తాగేటప్పుడు సున్నం వాసనో లేక ఐరన్ టేస్టో వస్తే మా పరిస్థితేంటి?" అని వాపోతున్నారు. నీటి కోసం పడే ప్రయాస, అదనపు శుద్ధి ఖర్చులు, పంపింగ్ ఛార్జీలు చూపి మళ్లీ ‘బాటిల్ రేటు’ పెంచేయరు కదా? అని కంగారు పడుతున్నారు.
ఇప్పటికైతే బీర్ టేస్ట్ మారిపోతుందని లేదా ధరలు కొండెక్కిపోతాయని అధికారికంగా ప్రకటించలేదు మందుబాబులారా... కానీ 'చుక్క' సంతోషం కోసం బార్‌కు వెళ్లే మందుబాబులు మాత్రం ప్రస్తుతం భయంతో వణుకుతున్నారు. "దేవుడా.. వర్షాలు సరిగ్గా పడి జలాశయాలు నిండాలి.. లేకపోతే మా బీరులో బోరు నీళ్ల టేస్ట్ రాకూడదు" అని గట్టిగా మొక్కుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కంపెనీలు ఈ వాటర్ క్రైసిస్‌ను ఎలా దాటుతాయో.. బీర్ ప్రియుల 'కిక్కు'ను ఎలా కాపాడతాయో చూడాలి..
