Begin typing your search above and press return to search.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: కాంగ్రెస్ ముందడుగు

తెలంగాణలో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  A.N.Kumar   |   26 Aug 2025 11:01 AM IST
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: కాంగ్రెస్ ముందడుగు
X

తెలంగాణలో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఆమోదం, గవర్నర్ ఆర్డినెన్స్‌పై సంతకం లేకపోయినా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.

- న్యాయపరమైన సవాళ్లపై చర్చలు

రిజర్వేషన్ల అమలులో తలెత్తే న్యాయపరమైన సమస్యలను అధిగమించడానికి, కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, న్యాయమూర్తి అభిషేక్ సింఘ్వీతో సుదీర్ఘంగా చర్చించారు. గ‌తంలో ఇలాంటి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలులో ఎదురైన సవాళ్లపై వీరు రెండు గంటల పాటు సమగ్రంగా చర్చించారు. రాష్ట్రపతి ఆమోదం లేకపోయినా.. ఆర్డినెన్స్‌కు అవకాశం లేకపోయినా రిజర్వేషన్ల అమలు సాధ్యమేనని సింఘ్వీ స్పష్టం చేసినట్లు భట్టి తెలిపారు.

- బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యం

బీసీలకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. కులగణన తర్వాత 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం తమ సంకల్పమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై బీజేపీ వంటి కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేరని ఆయన అన్నారు. న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా పార్టీ స్థాయిలోనైనా ఈ రిజర్వేషన్లను తప్పకుండా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

- త్వరలో స్థానిక ఎన్నికల నిర్ణయం

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ఇంకా స్పష్టత రాలేదని భట్టి తెలిపారు. ఈ నెల 30న మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై వారికి పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సమస్యలు ఉన్నప్పటికీ, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేయదనే సంకేతాలు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.