'రిజర్వేషన్' పై బంతాట.. సెల్ఫ్ గోల తప్ప!
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయం రాజకీయంగానే ఉంది తప్ప.. విధానపరమైన ముగింపు దిశగా అయితే కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లోనే తటస్థుల నుంచి వినిపిస్తోంది.
By: Garuda Media | 29 July 2025 3:51 PM ISTతెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయం రాజకీయంగానే ఉంది తప్ప.. విధానపరమైన ముగింపు దిశగా అయితే కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లోనే తటస్థుల నుంచి వినిపిస్తోంది. త్వరలోనే జరగనున్న మునిసిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్నది .. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. ఈ క్రమంలోనే బిల్లును ఆమోదించి.. రాష్ట్రపతికి పంపారు. అక్కడ నుంచి ప్రత్యుత్తరం రాకపోయే సరికి ఆర్డినెన్సు రూపంలో అమలు చేయాలని నిర్ణయించారు.
దీనికి కూడా.. గవర్నర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో పోరుబాటకు రెడీ అవుతున్నారు. దీనికి అందరూ కలిసి రావాలని.. మంత్రి పొన్న ప్రభాకర్ పిలుపునిచ్చారు. అంతేకా దు.. కలిసి రానివారు బీసీ ద్రోహులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో అసలు సర్కారు చేస్తోంది ఏంటి? సెల్ఫ్ గోల తప్ప! అనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రపతికి పంపించారు. .. గవర్నర్‌కు కూడా పంపించారు.. అయినప్పటికీ అనుమతి రాలేదంటే..ఎక్కడో లోపాలు ఉన్నాయనే కదా!?.
ఈ విషయాన్ని పరిశీలించి.. మరోసారి బిల్లును తీసుకువస్తే.. సర్కారు అనుకున్న లక్ష్యం సాధించేందుకు అమలయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. దీనిని రాజకీయం చేయడంద్వారా సమ యం దండగ తప్ప.. ప్రయోజనం ఏంటి? అనేది ప్రశ్న. అంతేకాదు.. బీసీల్లోనూ అనుమానాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. చిత్తశుద్ధి ఉంటే.. అమలు చేయాలన్న డిమాండ్ లు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం దీనిని సరైన పంథాలో డీల్ చేయాల్సి ఉంటుంది.
అలా కాకుండా.. రాజకీయంగా వినియోగించుకోవాలని భావిస్తే.. మాత్రం ఇబ్బందులు తప్పవు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎవరికి వారురాజకీయంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సర్కారే కీలక నిర్ణయం తీసుకుని అడుగులు వేయాలి తప్ప.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం ద్వారా రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్న విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికే చేసిన బిల్లులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగాలి. న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకోవాలి. అంతే తప్ప.. యాగీకి పోతే.. గతంలో ధాన్యం విషయంలో కేసీఆర్ చేసినట్టే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.
