Begin typing your search above and press return to search.

బీసీల బంద్ : అందరూ మద్దతుదారులే కానీ...!

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అన్ని రంగాలలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున బంద్ చేపట్టాయి.

By:  Satya P   |   19 Oct 2025 2:00 AM IST
బీసీల బంద్ : అందరూ మద్దతుదారులే కానీ...!
X

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అన్ని రంగాలలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున బంద్ చేపట్టాయి. ఈ బంద్ కి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ బంద్ లో పాల్గొన్నాయి. ఇది న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నాయి. బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాల్సిందే అని అవసరం అయితే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని కూడా పెంచాలని ఈ మేరకు రాజ్యాంగ సవరణలు కూడా చేయాలని అంతా కోరారు. అలా బీసీల బంద్ పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంతకీ బీసీల బంద్ కానీ వారి డిమాండ్లు కానీ ఎవరి మీద ఎవరి కోసం అన్న చర్చ అయితే సాగుతోంది.

తీర్చేది ఎవరని :

సాధారణంగా ఏలిన వారి విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమిస్తారు. తన డిమాండ్ల సాధన కోసం వారు రోడ్డెక్కుతారు. తమకు మద్దతుగా కలసి వచ్చే పక్షాలను కూడా సహకారం తీసుకుంటారు. అయితే బీసీల విషయంలో అన్ని పార్టీలదీ ఒక్కటే డిమాండ్. బీసీలకు పెద్ద శాతంలో రిజర్వేషన్లు దక్కాలన్న దాని మీద ఎవరికీ ఏ రకమైన అభ్యంతరాలు లేవు. మరి అంతా కలసినపుడు ఈ డిమాండ్ కి మద్దతు ఇస్తున్నపుడు ఈ డిమాండ్లను తీర్చేది ఎవరు అన్నదే పెద్ద డౌట్ గా ఉంది.

కేంద్రం తలచుకుంటే :

జాతీయ పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కనుక తలచుకుంటే చాలా సులువుగా రాజ్యాంగ సవరణ చేయవచ్చు. ఇప్పటిదాకా ఉన్న యాభై శాతం రిజవేషన్ల పరిమితిని కాస్తా ఏకంగా ఏ డెబ్బై శాతానికో పెంచుకోవచ్చు. కానీ ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాయనే అంతా అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇది చట్ట సభలలో జరగాల్సిన నిర్ణయం. పార్లమెంట్ వేదికలుగా జరపాల్సిన చర్చలు. అలాంటిది ఉద్యమాలు చేసే వారికి మద్దతు ఇచ్చి ఊరుకోవడంతో సరా అన్నదే అంతా ప్రశ్నిస్తున్న విషయంగా ఉంది.

చేతిలో అధికారం :

అధికారంలో ఉన్న పార్టీలే ఏమైనా చేయగలవు. వారే చట్టాలు చేస్తారు, రాజ్యాంగంలో సవరణలు కూడా చేస్తారు. కానీ ఆ పార్టీలే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం అంటే ఏమనుకోవాలి అని బీసీ మేధావులు అంటున్నారు. ఈ విషయంలో నిబద్ధత చాటాలి అంటే మద్దతు ఇచ్చి ఊరుకోవడం కాదని బీసీలకు పూర్తి న్యాయం చేయాలని కోరుతున్నారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ దిగ్గజ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు అయితే ప్రధాని మోడీకి నేరుగానే వినతి చేశారు. దేశాన్ని ఓబీసీ ప్రధాని ఏలుతున్నారని ఆయన హయాంలోనే బీసీల రీజర్వేషన్ డిమాండ్లు పరిష్కారం కావాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు.

జాతీయ పార్టీల మీద :

బీఆర్ఎస్ నేత హరీష్ రావు అయితే బీజేపీ కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. గల్లీలో పోరాటాలు చేయడమేంటి. బీసీల కోసం మీరు చేయాల్సింది చేయలేరా అని ప్రశ్నించారు. లోక్ సభలో చూస్తే బీజేపీకి 240 మంది ఎంపీల మద్దతు ఉంది, అలాగే కాంగ్రెస్ కి 99 మంది ఎంపీల మద్దతు ఉందని మరి బీసీల రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ఎవరు అడ్డంకి అన్నది చెప్పాలని కోరారు. కేంద్రంలో ఈ రోజుకీ బీసీ మంత్రిత్వ శాఖ లేదని ఆయన ఎత్తి చూపారు. బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు కానీ పరిష్కారాలు చేయలేకపోతున్నారు అని ఆయన మండిపడ్డారు. ఆయన అన్నారని కాదు కానీ బీసీల బంద్ కి అధికారంలో ఉన్న పార్టీలు మద్దతు ప్రకటించి అంతటితో సరి ఊరుకోవడమేంటని బీసీ సంఘాల నుంచి సూటి ప్రశ్నలే వస్తున్నాయి. చూడాలి మరి ఈ బంద్ తర్వాత అయినా జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఏమైన కదలిక వస్తుందేమో.