తెలంగాణకు తాళం: సర్వత్రా బంద్!
తెలంగాణకు తాళం పడింది. సర్వత్రా బంద్ ప్రభావం కనిపిస్తోంది. ప్రభుత్వ పార్టీ కాంగ్రెస్ కూడా బంద్‌కు మద్దతు తెలపడంతో అన్ని వ్యవస్థలు నిలిచిపోయాయి.
By: Garuda Media | 18 Oct 2025 2:34 PM ISTతెలంగాణకు తాళం పడింది. సర్వత్రా బంద్ ప్రభావం కనిపిస్తోంది. ప్రభుత్వ పార్టీ కాంగ్రెస్ కూడా బంద్‌కు మద్దతు తెలపడంతో అన్ని వ్యవస్థలు నిలిచిపోయాయి. ఒక్క అత్యవసర, పోలీసు, ఫైర్ డిపార్ట్‌మెంట్, వైద్యం తప్ప.. ఇతర వ్యవస్థలన్నీ.. బంద్ కారణంగా ఆగిపోయాయి. ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కలేదు. దీంతో సామాన్యుల జీవనం నరక ప్రాయంగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు. రోజువారీ వేతనంపై జీవించే కుటుంబాలకు ఇబ్బంది ఏర్పడిందని చెబుతున్నారు.
మంత్రుల నుంచి నాయకుల వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున బంద్‌లో పాల్గొన్నారు. ఉప్పల్, రాణిగంజ్ వంటి కీలకమైన బస్టాండ్ల వద్ద బీసీ జేఏసీ నాయకులు బంద్‌ను సంపూర్ణంగా నిర్వహిస్తున్నారు. ఒక్క బస్సును కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయితే.. రైలు ప్రయాణికులు బయటకు వస్తున్నా.. వారికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని ఆసరా చేసుకున్న ప్రైవేటు రవాణా సంస్థలు ధరలను రెట్టింపు చేశాయి.
ఎందుకీ బంద్?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశం. దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలూ మద్దతుగా నిలిచాయి. దీనిపై గవర్నర్ ఆమోదం తెలపకపోయినా.. సుప్రీంకోర్టు గతంలో తమిళనాడు గవర్నర్ విషయంలో ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ.. మల్కాజిగిరికి చెందిన మాధవరెడ్డి అనే రెడ్డి సామాజిక వర్గం ఉద్యమ నేత కోర్టులను ఆశ్రయించారు. ఫలితంగా ఈ జీవో న్యాయ పరమైన వివాదంలో చిక్కుకుంది.
మరోవైపు కేంద్రం పరిష్కరించాలన్న డిమాండ్ కూడా బుట్టదాఖలైంది. ఈ పరిణామాల క్రమంలో ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీలు జేఏసీగా ఏర్పడి బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనికి అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ గుండుగుత్తగా మద్దతు తెలిపాయి. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రానికి తాళం పడినట్టుగా ఎక్కడి వ్యవస్థలు అక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం 5 గంటల వరకు బంద్ జరగనుందని ఆర్ . కృష్ణయ్య వెల్లడించారు.
