Begin typing your search above and press return to search.

స్పీకర్ : అవమానించింది నా తల్లిని !

ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభ ప్రారంభమయిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   8 Sept 2026 4:17 PM IST
స్పీకర్ : అవమానించింది నా తల్లిని !
X

తెలంగాణ శాసనసభ సమావేశాలు రసాభసాగా మారుతున్నాయి. శాసనసభ సమావేశాల ప్రారంభం సంధర్బంగా బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు మధ్య జరిగిన వివాదం, ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేశాడన్న వివాదాస్పద వ్యాఖ్యలు శాసనసభను కుదిపేస్తున్నాయి. ఈ మేరకు నిన్ననే తాతా మధు శాసనమండలి సభ్యత్తం రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభ ప్రారంభమయిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఆవేశం నాకు రావాలి. హరీష్ రావుకు కాదు. ఎందుకు అంటే వారు నా తల్లిని అన్నారు. మీ తల్లిని అనలేదు. అందుకు నేను కోపం తెచ్చుకోవాలి. మీరు కాదు’ అని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు తన సోదరీమణులు అని, వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని’ స్పీకర్ అన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాతా మధు నిన్ననే ‘తాను చేసిన వ్యాఖ్యలు స్పీకర్ ను ఉద్దేశించి కాదు. ఒకవేళ అలా అని అనుకుంటే వాటిని తాను ఉపసంహరించుకుంటున్నట్లు’ వ్రాత పూర్వకంగా మీడియాకు నోట్ విడుదల చేశారని, స్పీకర్ కు అవమానం అనిపిస్తే ఆ విషయంలో బీఆర్ఎస్ కూడా బాధపడుతుందని, కానీ ఇదే సమయంలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, కేసులు కూడా పెట్టారని అన్నారు. ఈ సంధర్భంగా సభలో స్పీకర్ - హరీష్ రావుల మధ్య పలుమార్లు వాగ్వివాదం జరిగింది.

శాసనసభ సమావేశాలు ఆరు రోజులు నిర్వహించాలని నిన్న బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. నిన్న సమావేశాల ప్రారంభం రోజునే వివాదాలు మొదలయ్యాయి. సభలో జరిగిన చర్చకన్నా బయట జరిగిన వివాదాలే ఎక్కువగా ఉన్నాయి. నిన్న శాసనసభలో మొదలయిన వివాదం నేడు ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరింది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యన మొదలయిన తాజా వివాదాలు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఇప్పటికే ఈ నెల 10 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై రోజుకొక అంశం మీద ఆందోళన చేస్తున్నది. దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ రాజీనామా చేయాలని పోటీ ఆందోళనలు నిర్వహిస్తున్నది. ఇప్పుడు ఆందోళనలు కాస్తా దాడుల వరకు దారితీయడం గమనార్హం.