తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమరం.. ఇవే హైలెట్...!
తెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది.
By: Garuda Media | 30 Aug 2026 9:24 AM ISTతెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు శాసనసభ కార్యదర్శి అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకావడంపై అనిశ్చితి నెలకొనడంతో, బీఆర్ఎస్ తరఫున పోరాట భారాన్ని కేటీఆర్, హరీష్ రావు తమ భుజస్కంధాలపై వేసుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్న విమర్శలు తెలంగాణ ప్రజానీకంలో ఉన్నాయి. ఈ సారి కూడా కేసీఆర్ రాకపోతే అది మరింత చర్చకు, విమర్శలకు తావిచ్చినట్లవుతుంది.
ఈ సారి అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు, గ్యారంటీల అమలుపై ప్రధానంగా చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధుల పెన్షన్ల పెంపు, బకాయిల చెల్లింపు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, రైతు భరోసా నిధులు, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనికి తోడు వివాదాస్పదంగా మారిన సెక్షన్ 22 - A భూముల వ్యవహారం, భూసేకరణ అంశాలను సభలో కీలక అస్త్రాలుగా మలుచుకోవడానికి విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి.
మరో వైపు, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలు, కృష్ణా - గోదావరి జలాల వివాదాలు, భూ కేటాయింపులపై ప్రతిపక్షాన్ని కౌంటర్ చేసేందుకు మంత్రులు సమాధానాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమ రెండేళ్ల పాలనా విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను సభ వేదికగా ఎత్తిచూపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అన్నింటికీ మించి, చట్టసభల్లో యువతకు ప్రాతినిధ్యం పెంచేందుకు వీలుగా పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. తొలిరోజే జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో ఈ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది.
