Begin typing your search above and press return to search.

10 రోజులా 20 రోజులా.. స‌భా స‌మ‌రంపై ప‌ట్టు!

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌న్న విష‌యంపై అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్దం చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   16 March 2026 6:23 PM IST
10 రోజులా 20 రోజులా.. స‌భా స‌మ‌రంపై ప‌ట్టు!
X

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌న్న విష‌యంపై అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్దం చోటు చేసుకుంది. ప‌ది రోజుల క‌న్నా ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌లేమని ప్ర‌భుత్వం పేర్కొంది. కానీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం మాత్రం.. ప‌ది రోజులు కాదు.. 20 రోజులు నిర్వ‌హించాల్సిందేన‌ని తేల్చి చెబుతోంది. అయితే.. ఈ విష‌యంపై మంగ‌ళ‌వారం నిర్వ‌హించ‌నున్న బీఏపీ స‌మావేశంలో నిర్ణ‌యిద్దామ‌ని అధికార ప‌క్షం చెబుతోంది.

ప‌దిరోజులు అయితే..

రాష్ట్ర స‌ర్కారు ప‌ది రోజుల వ‌ర‌కే స‌భ‌ను నిర్వ‌హించ‌డంపై దృష్టి పెట్టింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై 4 రోజులు.. స‌మ‌యం ఇస్తారు. అనంత‌రం కీల‌క బిల్లుల‌ను ఆమోదించుకునేందుకు మ‌రో రెండు రోజులు కేటాయిస్తారు. మ‌ధ్య‌లో బ‌డ్జ‌ట్ ప్ర‌సంగం.. స‌హా ఇత‌ర కార్య‌క‌లాపాలు ఉంటా య‌ని చెబుతోంది. అదేస‌మ‌యంలో సెల‌వుల‌ను కూడా దృష్టిలో పెట్టుకుంటే.. ప‌ది రోజులు స‌రిపోతాయని అధికార ప‌క్షం తేల్చి చెబుతోంది.

కానీ.. 20 రోజుల పాటు స‌భ‌ను కొన‌సాగించాల‌ని.. త‌ద్వారా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించాల‌ని బీఆర్ఎస్ పార్టీ ప‌ట్టుబ‌డుతోంది. గవర్నర్‌ ప్రసంగం, ధన్యవాద తీర్మానం, రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం, ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించడం వంటి అంశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కారాద‌ని.. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు చ‌ర్చించాల‌ని కేటీఆర్ స‌హా హ‌రీష్‌ రావు.. తాజాగా మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

ముఖ్యంగా మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌పై పెద్ద ఎత్తున చ‌ర్చించాల‌ని కోరుతున్నారు. అమ‌లు కాని ఆరు గ్యారెంటీలు స‌హా.. సింగరేణి బొగ్గు గనుల వ్య‌వ‌హారం.. ఐఏఎస్ అధికారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు.. వంటి కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావిస్తోంది. ఇక మ‌రీ ముఖ్యంగా త‌మ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని కూడా బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. అయితే.. రాష్ట్ర స‌ర్కారు మాత్రం.. స‌మ‌స్య‌ల‌పై ఈ 10 రోజుల్లోనే చ‌ర్చిద్దామ‌ని.. వీటితోపాటు డ్రగ్స్ వ్య‌వ‌హారంపైనా చ‌ర్చిద్దామ‌ని చుర‌క‌లు అంటిస్తుండ‌డం గ‌మ‌నార్హం.