సారు కేసీఆర్.. అసెంబ్లీకి రారు.. కాగల కార్యం బహిష్కరణ తీర్చింది
కాగల కార్యం గంధర్వులు తీర్చారు.. అని తెలుగులో ప్రసిద్ధ వ్యాఖ్య. అంటే, ఒకరు అనుకున్న పని ఊహించని విధంగా పూర్తవడాన్ని దీనితో సూచిస్తారు.
By: Tupaki Political Desk | 2 Jan 2026 4:31 PM ISTకాగల కార్యం గంధర్వులు తీర్చారు.. అని తెలుగులో ప్రసిద్ధ వ్యాఖ్య. అంటే, ఒకరు అనుకున్న పని ఊహించని విధంగా పూర్తవడాన్ని దీనితో సూచిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో ఇదే అంశాన్ని వర్తింపేజేయాలేమో..? ఆ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనే పాయింట్ తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా హాట్ టాపిక్. ఆరు నెలలకు మించి శాసన సభ సమావేశాలకు హాజరు కాకుంటే అనర్హత వేటు పడుతుందనే నేపథ్యంలో కేసీఆర్ గత వారం అసెంబ్లీకి వెళ్లి రిజిస్టర్ లో సంతకం పెట్టి వచ్చేశారు. అప్పటికీ కేసీఆర్ ను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి మరీ పలకరించారు. కొన్ని నిమిషాలు మాత్రమే సభలో ఉన్న కేసీఆర్ వెంటనే బయటకు వచ్చేశారు. దీంతో ఈ నెల 2వ తేదీ నుంచి పునఃప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? రారా? అనే సందేహం నెలకొంది. దానికి శుక్రవారం సమాధానం దొరికింది. తెలంగాణ అసెంబ్లీ సెషన్ ను బీఆర్ఎస్ బహిష్కరించింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు, స్పీకర్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో కేసీఆర్ అసలు సభకు రావాల్సిన అవసరమే లేకపోయింది.
ప్రమాణానికి హాజరై...
2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడే గాయపడ్డారు. లోక్ సభ ఎన్నికలకు కాస్త కోలుకుని ప్రచారం చేశారు. అనంతరం అసెంబ్లీకి శాసన సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక అసెంబ్లీ మీడియా పాయింట్ కు వచ్చి మాట్లాడారు. ఇక తుపాను రేపుతానని ప్రకటించి వెళ్లిపోయారు. మళ్లీ ఆయన అసెంబ్లీకి రానే లేదు. తాజా రాజకీయా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయమై విమర్శలు చేశారు. తాను అసెంబ్లీకి హాజరవుతున్నట్లు తెలిపి.. ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మొదటి రోజు సభకు వచ్చారు. వాయిదా అనంతరం పునఃప్రారంభమైన సమావేశాలకు రావాల్సిన అవసరం లేకుండానే ఆయన పార్టీనే బహిష్కరించింది.
వాకౌట్ ... బాయ్ కాట్ తో సరి..
శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఆ పార్టీ శాసన సభా పక్ష ఉప నేత హరీశ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్, స్పీకర్ వైఖరిని నిరసిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లి గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి నిరసన తెలిపారు. రేవంత్ ప్రభుత్వ ప్రజాస్వామిక విలువలు పాటించడం లేదని, బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సభను నడుపుతోందని ఆరోపించారు. సభలో సీఎం రేవంత్ దుర్భాషలు ఆడుతున్నారని, ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు ప్రధాన ప్రతిపక్షమైన తమకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. సీఎంను విమర్శించవద్దని స్పీకర్ సూచించడం ఏమటని ప్రశ్నించారు. మూసీ నది కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని పేర్కొన్నారు.
